Bhu Bharathi । భూభారతి చట్టంతో తెలంగాణ రైతులకు ప్రయోజనం ఏమిటి?
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చలన్నీ కొత్తగా అమల్లోకి రానున్న భూభారతి చట్టం గురించే! ఇన్నాళ్లూ ధరణితో ఇబ్బందులు పడిన రైతాంగం.. తమ సమస్యలకు భూ భారతిలోనైనా పరిష్కారాలు దొరుకుతాయని ఆశపడుతున్నారు. ఆ ఆశలు ఎంత వరకూ నెరవేరుతాయి? చట్టంలో మార్పులేంటి? సమస్యలకు పరిష్కారాలేంటి?

(తిప్పన కోటిరెడ్డి)
Bhu Bharathi । భూమికి ప్రజలకు విడదీయలేని సంబంధం ఉంది. తెలంగాణలో పోరాటాలన్నీ (struggles) భూమి చుట్టూనే తిరిగాయి. అలాంటి తెలంగాణ(Telangana)లో భూమి సమస్యల పరిష్కార వ్యవస్థ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. కానీ 2020లో ధరణి చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి భూమి సమస్యల పరిష్కార వ్యవస్థ ప్రజలకు దూరమైంది. గ్రామంలో రెవెన్యూ అధికారి లేడు.. తాసిల్దార్ దగ్గరకు వెళితే.. ‘నేను చేయగలిగేది ఏమీ లేదు… ధరణి (Dharani portal) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోండి.. కలెక్టర్ చూస్తారు’ అంటూ తిప్పి పంపించేవారు. వ్యక్తిగతంగా వెళ్లి జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్‌ను కలువడం సగటు రైతుకు సాధ్యం అయ్యే పని కాదు. ఇలా 2020లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం అధికారులకు, రైతులకు మధ్య ఉన్న లింకును తెంపేసింది. రైతులు కానీ, అధికారులు కానీ కంప్యూటర్‌తో మాత్రమే మాట్లాడేలా చేసింది. దరఖాస్తు చేసుకో… ఆ తరువాత కలెక్టర్ దైవాధీనం. తాసిల్దార్(Tahsildar), ఆర్డీవో (RDO)లను నాటి సర్కారు వేలిముద్రగాళ్లను మాత్రమే చేసిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. తాసిల్దార్‌కు కనీసం రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతలనైనా ఇచ్చారు. ఆర్డీవోలనైతే ఎందుకు కొరగాని ఆరో వేలుగా నాటి సర్కారు దిగజార్చిందన్న విమర్శలు వినిపించాయి. లక్షల ఎకరాల భూమి సమస్యలన్నీ అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. వ్యవసాయం చేసుకునే రైతు తన భూమి సమస్య పరిష్కారం కావాలంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి నాటి సర్కారు కల్పించింది.
హైకోర్టు ఆదేశించినా నాడు మారని ధరణి
ధరణిలో రైతులు ఎదుర్కొటున్న భూమి సమస్యలపై గతంలో హైకోర్టు (High Court) న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ఘాటు వాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ధరణి పోర్టల్ వల్ల బ్రోకర్లు బాగు పడుతున్నారన్నారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కారం అవడం లేదని కోర్టుకు రోజుకు 30, 40 పిటిషన్ల వస్తున్నాయని, వీటిని ఎలా పరిష్కరిస్తారని సీసీఎల్ఏను ఆనాడు కోర్టు ప్రశ్నించింది. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టం కారణంగా సీసీఎల్ఏ (CCLA).. హైకోర్టు బోనులో తలదించుకొని నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధరణిపై కోర్టుకు వచ్చిన కేసులను పరిశీలిస్తే ధరణిలో 20 రకాల సమస్యలు (20 types of problems) ఉన్నట్లు గుర్తించినట్లు నాటి న్యాయమూర్తి తెలిపారు. ధరణి సమస్యలను 2024 జూన్ నాటికి పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా చట్టంలో ఉన్న అడ్డంకుల కారణంగా సమస్యలను పరిష్కరించ లేక పోయింది సర్కారు. ఆ యా సమస్యలను పరిష్కరించాలంటే చట్టాన్నే మార్చాలన్న నిర్ణయానికి వచ్చామని కొత్త ప్రభుత్వం చెబుతున్నది. ధరణిలో సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు చేసుకున్నా.. అవి రిజక్ట్ కావడమే కానీ పరిష్కారం అయ్యేవి కాదని అనేక మంది రైతులు చెబుతున్నారు. ధరణి చట్టం అమలులోకి వచ్చిన తరువాత భూమి సమస్యలు 20 లక్షలకు పైనే ఉన్నాయని గుర్తించారు. 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బీ(Part B)లో ఉన్నాయి. ఇవి రికార్డుల్లోకి ఎక్కలేదు. వీటి పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో 33 మాడ్యూల్స్ తీసుకు వచ్చినా ఎగ్జిక్యూట్ చేసే అధికారులకు అధికారాలు లేక అవి అపరిష్కృతంగానే పడి ఉన్నాయి. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ యా సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించిన తరువాత కొన్ని పరిష్కారం అయ్యాయి. మరికొన్ని అలాగే ఉన్నాయి. వాస్తవంగా ధరణి చట్టం చాలా వాటికి పరిష్కారం చూపించలేక పోయింది. ముఖ్యంగా భూమి రికార్డు, పాస్ పుస్తకాల సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలకి ఆ చట్టంలో పరిష్కారం లేదు… ఆ చట్టాన్ని సవరించితే కూడా సరిపోదు… సమగ్రంగా మారిస్తే తప్పక రైతాంగ సమస్య పరిష్కారం దొరకదు.
కోర్టు మెట్లెక్కాల్సిన పని లేకుండా..
భూ పరిపాలనలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో పర్యవేక్షక వ్యవస్థ ఉండాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారు, భూమి సమస్యల పరిష్కారానికి రైతులు (farmers ) కోర్టుల మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా అధికారుల స్థాయిలోనే పరిష్కారం అయ్యే మార్గాలను పరిశీలించారు. ఈ మేరకు ధరణిపై కమిటీ వేసిన రేవంత్ రెడ్డి.. ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం (Act) అమలులోకి రావడానికి ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపించారు. గవర్నర్ సంతకం తరువాత చట్టం అమలులోకి రానున్నది.
నాడు కేంద్రీకృతం.. నేడు వికేంద్రీకరణ
ధరణి చట్టంలో అధికారాలు కేంద్రీకృతం చేయగా భూ భారతి చట్టం అధికారాలను వికేంద్రీకరణ చేస్తున్నది. ధరణిలో కలెక్టర్‌కు పరిమిత అధికారాలు, ఆపైన సీసీఎల్ఏ, లేదా సివిల్ కోర్టు మాత్రమే. పైగా గ్రామ స్థాయిలో ఉండే పర్యవేక్షక అధికారి (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. కానీ కొత్తగా అమలులోకి రానున్న భూ భారతి చట్టంలో గ్రామ స్థాయిలో పర్యవేక్షక అధికారి ఉండాలని స్పష్టం చేసింది. రైతులు కలెక్టర్ వద్దకో.. కోర్టుల చుట్టూతనో తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలో తాసిల్దారే భూమి సమస్యలను పరిష్కరించే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు తాసీల్దార్ కు అధికారాలు అప్పగించింది. ఆపైన ఆర్డీఓకు పర్యవేక్షించే అధికారం కల్పించింది. ఇలా తాసీల్దార్ వద్ద పరిష్కారం కానీ సమస్యలను ఆర్డీఓ వద్ద, అక్కడ పరిష్కారం కాకుండా కలెక్టర్ వద్ద రివిజన్ పిటీషన్ వేయించి పరిష్కరించుకునే అవకాశాన్ని భూ భారతి చట్టం కల్పిస్తోంది. దీంతో రైతులు తమ భూమి సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా పరిష్కరించే అవకాశాన్ని కొత్త ప్రభుత్వం కల్పించనున్నది.
కింది స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం
కింది స్థాయిలోనే భూ సమస్యల పరిష్కార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలని న్యాయనిపుణులు చెపుతున్నారు. అయితే బీఆరెస్ (BRS) నేతలు, వారిని సమర్థించే మీడియా మాత్రం భూ సమస్యల పరిష్కార వ్యవస్థ కింది స్థాయిలో అందుబాటులోకి వస్తే అవినీతి పెరుగుతుందని చెపుతున్నది. గతంలో రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపేందుకే కింది స్థాయిలో అధికారులకు ఉన్న అధికారాలన్నీ రద్దు చేశామని చెప్పుకున్నది. అయితే.. ధరణి వచ్చిన తరువాత అధికారాలన్నీ కేంద్రీకృతం కావడంతోనే అవినీతి బాగా పెరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ధరణి చట్టం రాక ముందు వేయి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయ్యేదని, ధరణి వచ్చిన తరువాత వేయి రూపాయలు పెట్టి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ‘రిజక్ట్’ అని సమాధానం వచ్చేదని ప్రతాపరెడ్డి అనే రైతు తెలిపారు. దరఖాస్తులకే వేల రూపాయలు ఒడిసేవన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు మాట్లాడుతూ పాత రోజుల్లో వేయి రూపాయలతో అయ్యే పని ధరణి వచ్చిన తరువాత లక్షలు ఖర్చు చేసినా కాలేదని వాపోయాడు. ధరణి వచ్చిన తరువాత, అధికారాలు కేంద్రీకృతం కావడం ఫలితంగానే అవినీతి పెరిగిందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు. అధికారాలు వికేంద్రీకరిస్తేనే ఫలితాలు బాగుంటాయని, ఒక చోట అన్యాయం జరిగితే మరో చోటనైనా న్యాయం దొరుకుతుందని చెప్పారు. అధికారాల వికేంద్రీకరణతో పాటు అప్పీల్ వ్యవస్థ ఉండాలని సదరు జర్నలిస్ట్ అన్నారు. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో తాసిల్దార్ నుంచి కలెక్టర్ వరకు అందరికీ అధికారాలున్నాయని, అప్పీల్ వ్యవస్థ ఉందని సీనియర్ రెవెన్యూ అధికారి ఒకరు అన్నారు. ఈ వ్యవస్థ వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.
భూ భారతిలో తాసిల్దార్లకు అధికారాలు
ధరణి చట్టంలో భూమి సమస్యను పరిష్కరించడానికి అధికారులకు ఎలాంటి అధికారాలు లేవని న్యాయ నిపుణులు సునీల్ కుమార్ తెలిపారు. ఎలాంటి అధికారాలు కూడా లేకుండా కలెక్టర్, సీసీఎల్‌ఏలు పని చేశారన్నారు. భూ భారతి చట్టంలో తాసిల్దార్ మొదలుకొని.. కలెక్టర్ వరకు సమస్యలను పరిశీలించి, పరిష్కరించే అధికారాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఎంత సమర్థవంతంగా అమలు చేస్తే ప్రజలకు అంత మేరకు సత్వర న్యాయం జరుగుతుందని సునీల్ తెలిపారు.