Rainfall Deficit Telangana | రైతన్నతో వరుణుడి దోబూచులాట.. సాగు లక్ష్యం ఇప్పటికి ఇంకా సగమే!

Rainfall Deficit Telangana | ఈ ఖరీఫ్ సీజన్ లో ముందుగా రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయి వర్షాలు కురువకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట సగం సాగు లక్ష్యాన్ని మాత్రమే చేరుకుంది. ఈ నెల మొదటి వారానికి రాష్ట్ర వ్యాప్తంగా 57,02,011 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటల సాగు ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్ లో సాధారణ సాగు లక్ష్యం 1,32,44,305 ఎకరాలు ఉండగా సగం మాత్రమే సాధ్యమైంది. వర్షాలు కురువకపోవడంతో పంట సాగు జాప్యమవుతోంది. గత ఏడాది ఈ సమయంతో పోల్చితే లక్ష్యాన్ని అధిగమించారు. గత ఏడాది ఈ సమయానికి 56,19,751 ఎకరాల్లో సాగు చేయగా ఈ సీజన్ లో లక్ష్యాన్ని 56,26,243 ఎకరాలుగా నిర్ధేశించుకోగా ఆ లక్ష్యం మాత్రం అధిగమించారు. గత ఖరీఫ్ తో పోల్చితే లోటువర్షపాతం నమోదుకావడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆశచావని అన్నదాతలు మాత్రం మొగులుదిక్కు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.
వరుణునిపై రైతన్న భారం
గత ఏడాది సగటు వర్షపాతం 923.8 మి.మీ కాగా, నైరుతిరుతుపవనాల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జూన్ మొదటి నుంచి నేటి వరకు సాధారణ వర్షపాతం 185.4 మిమిలు ఉండగా ఇప్పటి వరకు 165.5 మి.మి మాత్రమే కురిసింది. -11 మి.మి లోటు నెలకొన్నది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదుకాగా, జూలైలోనే లోటు ఏర్పడింది. ఈ వానకాలంలో నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే ప్రారంభమై మురిపించినప్పటికీ తదుపరి ముఖం చాటేశాయి.23 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. 10 జిల్లాలో తక్కువ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, సిద్దిపేట,వరంగల్, హనుమకొండ,మహబూబాబాద్, ములుగు, ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల,పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్‌భూపాలపల్లి, జనగామ, మేడ్చల్, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి,హైదరాబాద్ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వర్షపాతం అత్యల్పంగా నమోదైంది.
సాగులో వరి, పత్తి వైపు మొగ్గు
రాష్ట్రంలో రైతులు ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ వానకాలం సీజన్ లో కూడా వరి, పత్తి పంటల వైపు మొగ్గు చూపారు. తగిన వర్షపాతం, నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిసాగు చేపట్టగా మిగిలిన వర్షాధారంతో పాటు స్వంత నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, పెసర పంటలకు ప్రాధాన్యమిచ్చారు. పూర్తి వర్షాధార ప్రాంతాల్లో జొన్న ఇతర మెట్టపంటల వైపు రైతులు మొగ్గు చూపారు. ఇప్పటి వరకు వరి 40,3,109 ఎకరాల్లో, పత్తి 38,34,146 ఎకరాల్లో, మొక్కజొన్న 22,6,054 ఎకరాల్లో, జొన్న 36,008 ఎకరాల్లో, కంది 4,61,432 ఎకరాల్లో, పెసర 6,0548 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తం నూనెగింజల సాగు 3,35,550 ఎకరాల్లో, పప్పు ధాన్యాలు 5,44,992 ఎకరాల్లో సాగు చేశారు. వరి, బెంగాల్ శెనగ, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు,ఆముదం పంటలు 25 సాగు చేశారు. కంది, పెసర, ఉలువలు, పొగాకు, చెరుకు పంటలు 26 నుంచి 50శాతం సాగుచేశారు. జొన్న, సోయాబీన్, పత్తి పంటలు మాత్రం 51 నుంచి 75శాతం సాగు చేశారు. మొక్కజొన్న వంద శాతం సాగుచేశారు. జిల్లాల వారీగా పంటల సాగు విస్తీర్ణం శాతం వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, ములుగు, మేడ్చల్,వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో కేవలం 25శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగు చేశారు. మంచిర్యాల, కామారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 26 నుంచి 50శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో 51 నుంచి 75 విస్తీర్ణంలో పంటల సాగు జరిగింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 75శాతం నుంచి 100శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. గత ఏడాది వానకాలంతో పోల్చితే ఈ ఏడాది కూడా రైతులు ఆశాభావంతో ఉన్నారు. అయితే అక్కడక్కడ వరి నారు ముదిరిపోతుండగా, వర్షాలు కురిసి నీరు అందుబాటులోకి వస్తే వట్టినారుతోనైనా పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, సకాలంలో వర్షాలు లేనందున కొన్ని ప్రాంతాల్లో రైతులు జొన్న, మొక్కజొన్న తదితర మెట్టపంటలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే జూలై రెండవ వారంలోకి అడుగిడినందున జాప్యం చేస్తే పంటల సాగుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని భావించి మెట్టపంటలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు రైతులు వేచిచూసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.