Cotton Crop Low Yield | ప‌త్తి కొనుగోళ్ల‌పై నీలినీడ‌లు! ఉస్సూరుమంటున్న రైతులు

తెలంగాణలో సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిన్నది. దీంతో తగిన దిగుబడి రాలేదు. వచ్చిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేసేందుకు జిన్నింగ్‌ మిల్లులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

  • By: TAAZ    weeds    Oct 05, 2025 3:00 AM IST
Cotton Crop Low Yield | ప‌త్తి కొనుగోళ్ల‌పై నీలినీడ‌లు! ఉస్సూరుమంటున్న రైతులు

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌ 5 (విధాత‌ ప్రతినిధి):

Cotton Crop Low Yield | ఈ ఏడాది ఎడ‌తెరిపి లేకుండా భారీగా కురిసిన వ‌ర్షాల‌తో ప‌త్తి పంట దెబ్బ‌తిన్న‌ది. దిగుబ‌డి కూడా రైతులు ఆశించినంత‌గా వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అయితే దిగుబ‌డి అయిన ప‌త్తిని కూడా కొన‌డానికి జిన్నింగ్ మిల్లులు ముందుకు రాని ప‌రిస్థితి తెలంగాణ‌లో ఏర్ప‌డింది. ఫ‌లితంగా ఈ సీజ‌న్‌లో ప‌త్తి కొనుగోళ్ల‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఒకవైపు ఎడ‌తెరిపి లేకుండా కురిసిన భారీ వ‌ర్షాల‌తో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. మరోవైపు చేతికి వచ్చిన కాస్త పంటను కూడా కొన‌డానికి జిన్నింగ్ మిల్లులుకు ముందుకు రాక‌పోవ‌డంతో రైతు ప‌రిస్థితి మూలిగే న‌క్క‌పై తాటి పండు చందంగా మారింది. రాష్ట్రంలో 341 జిన్నింగ్ మిల్లులు ఉన్నా.. ప‌త్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్ర‌భుత్వం టెండ‌ర్లు పిలిస్తే ఒక్క జిన్నింగ్ మిల్లు కూడా టెండ‌ర్‌లో పాల్గొన‌క పోవ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య‌ను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు జిన్నింగ్ మిల్లుల ప్ర‌తినిధుల‌తో, సీసీఐ ఎండీతో స‌మావేశం నిర్వ‌హించి అమ్మ‌కాలు ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కానీ జిన్నింగ్ మిల్లులు ముందుకు రాక‌పోతే వాటిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌దానిపై అధికారుల‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌క‌పోవ‌డం కూడా అనేక సందేహాల‌కు తావిస్తోంది.

అధిక వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న ప‌త్తి పంట‌

అధిక వ‌ర్షాల ఎఫెక్ట్ ప‌త్తి దిగుబ‌డిపై ప‌డింది. ఈ ఏడాది స‌గానికి స‌గం ప‌త్తి దిగుబ‌డి త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. 43.29 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ప‌త్తి పంట సాగు చేస్తే 24.70 ల‌క్ష‌ల ట‌న్నుల ప‌త్తి మాత్ర‌మే దిగుబ‌డి అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. సాధార‌ణంగా ఎక‌రానికి దాదాపుగా 10 నుంచి 12 క్వింటాళ్ల ప‌త్తి దిగుబ‌డి వస్తుంది. పంట బాగా వ‌స్తే 15 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎక‌రానికి స‌గ‌టున 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని వ్య‌వ‌సాయ‌శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే దిగుబ‌డి కూడా వ‌ర్షాల‌కు త‌డ‌వ‌డంతో అంత నాణ్య‌త ఉండ‌క‌పోవ‌చ్చున‌ని భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో దిగుబ‌డి అయ్యే ప‌త్తిని కొనుగోలు చేయ‌డానికి జిన్నింగ్ మిల్లులు ముందుకు రాక‌పోవ‌డ‌మే ఇందుకు తార్కాణం అని చెపుతున్నారు.

కోనుగోళ్ల కోసం..స‌ర్కారు తిప్ప‌లు

తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 2025 సెప్టెంబ‌ర్ 20న‌ సీసీఐ విడుదల చేసిన లింట్ పర్సంటేజ్ L1 స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ విషయాల వ‌ల్ల‌నే జిన్నింగ్ మిల్లులు టెండ‌ర్‌లో పాల్గొన‌లేద‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. మంత్రి ఈ సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్ళి సమస్యను త్వరగా పరిష్క‌రించాల‌ని కోరారు. వాస్త‌వంగా ప‌త్తి కొనుగోళ్ల‌కు సంబంధించిన నిబంధ‌న‌లను కేంద్ర‌మే రూపొందిస్తోంది. కేంద్రం కూడా ఒక మెట్టు దిగి పరిస్థితుల మేర‌కు సడలిస్తామని చెప్పారు. అలాగే లింటుశాతం కూడా ప్రతి 15రోజులకొకసారి నిర్ణయించి అమలు చేస్తామన్నారు. అయినప్పటికీ జిన్నింగ్ మిల్లులు టెండర్లు వేయటానికి ముందుకు రాలేదు. దీంతో సోమవారం మరొసారి జిన్నింగ్ మిల్లుల య‌జ‌మాన్యంతో సమావేశం కానున్నారు.

ఇవి కూడా చదవండి..

Tamilnadu Woman Breaking Coconut On Head | మహిళ తలపై కొబ్బరికాయలు కొట్టారు..అరుంధతి సినిమా సీన్
THB Auction | ఈ నెల 6 నుంచి హౌసింగ్ బోర్డు భూముల విక్రయాలు — చింతల్‌లో బహిరంగ వేలం, కెపిహెచ్‌బి–రావిర్యాలలో ఈ-వేలం
BC Reservation : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్