Vertical Farming | రైతుల‌కు శుభ‌వార్త‌.. వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయానికి రూ. 2 కోట్ల రుణాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..!

Vertical Farming | మీకు వ్య‌వ‌సాయం( Agriculture ) చేయాల‌నే కోరిక ఉందా..? అందులోనూ వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం( Vertical Farming ) చేయాల‌నుకుంటున్నారా..? త‌క్కువ జాగ‌లో ఎక్కువ దిగుబ‌డి రాబ‌ట్టాల‌నుకుంటున్నారా..? ఇంకేందుకు ఆల‌స్యం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ( Agriculture Infrastructure Fund – AIF ) కింద వర్టిక‌ల్ వ్యవ‌సాయానికి కేంద్రం రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాలు అందిస్తోంది.

  • By: raj    weeds    Apr 20, 2025 8:18 AM IST
Vertical Farming | రైతుల‌కు శుభ‌వార్త‌.. వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయానికి రూ. 2 కోట్ల రుణాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..!

Vertical Farming | భార‌త‌దేశంలో 80 శాతం మంది వ్య‌వ‌సాయం( Agriculture ), దాని అనుబంధ రంగాల‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. ఉన్నంత పొలంలో రైతులు వివిధ ర‌కాల పంట‌ల‌ను పండిస్తున్నారు. సాగు ద్వారా కొంద‌రు లాభాల‌ను గ‌డిస్తే.. మ‌రికొంద‌రు న‌ష్ట‌పోతున్నారు. లాభ‌సాటి వ్య‌వ‌సాయం లేక రైతు( farmer ) దివాళా తీస్తున్నాడు.

ఈ క్ర‌మంలో రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయాన్ని ఆధునీకరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకం తీసుకొచ్చింది. ఆ ప‌థ‌కం పేరు.. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ( Agriculture Infrastructure Fund – AIF ). ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాలు అందిస్తోంది. అది కూడా త‌క్కువ వ‌డ్డీకి. ఈ రుణాలు 3 శాతం వ‌డ్డీ రాయితీతో కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌నుంది.  దీన్ని 7 సంవత్సరాల వరకూ పొందవచ్చు

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం( Vertical Farming ), పాలీహౌజ్( Poly house ), టిష్యూ క‌ల్చ‌ర్( Tissue Culture ), న‌ర్స‌రీ( Nursery ), హానీ ప్రాసెసింగ్, సెరిక‌ల్చ‌ర్( Seri Culture ), పుట్ట‌గొడుగుల పెంప‌కం( Mushroom farming ) తో పాటు మీ పొలాల్లో కోల్డ్ స్టోరేజ్( Cold Storage ), షెడ్, గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు( Packing Units ), ఇతర అవసరమైన సదుపాయాలు నిర్మించుకోవాలనుకునే రైతుల‌కు బ్యాంకు ద్వారా రూ.2 కోట్ల వరకు రుణాన్ని అందిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం.

మ‌రి వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం అంటే ఏమిటి..?

వర్టికల్ వ్యవసాయం ( Vertical farming ) అంటే, నిలువుగా పొరలు ( layers )గా పంటలను సాగు చేసే పద్ధతి. ఈ వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయానికి భూమి అవ‌స‌రం లేదు. భూమితో సంబంధం లేకుండా.. హైడ్రోపోనిక్స్( Hydroponic Farming )(నీటిలో పెంచడం), ఆక్వాపోనిక్స్ ( Aquaponic Farming ) (చేపలు, మొక్కలు కలిసి పెరగడం), ఏరోపోనిక్స్( Aeroponic Farming ) (మొక్కల వేర్లు గాలిలో ఉండటం) వంటి పద్ధతులను ఉపయోగించి పంట‌ల‌ను పండిస్తారు. ఈ సాగుకు అధికంగా ఇండ్ల‌లో, త‌క్కువ భూమి ఉన్న ప్రాంతాల్లో జ‌రుగుతుంది. వ‌ర్టిక‌ల్ సాగు వ‌ల్ల పంట‌ల దిగుబ‌డి పెరుగుతుంది. అంతేకాకుండా వాతావ‌ర‌ణ మార్పుల‌తో సంబంధం లేకుండా పంట‌ల‌ను సాగు చేయ‌డానికి ఆస్కారం ఉంది. సేంద్రీయ( Organic ) విధానంలో పంట‌ల‌ను పండించొచ్చు. వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం అధికంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చేస్తున్నారు. ఎందుకంటే నేల‌తో అవ‌స‌రం లేదు కాబ‌ట్టి.

అంటే వ్య‌వ‌సాయం చేయాల‌నే మ‌క్కువ ఉండి.. భూమి స‌దుపాయం లేని రైతుల‌కు ఈ ప‌థ‌కం ఒక వ‌రం అని చెప్పొచ్చు. ఇటీవ‌లి కాలంలో చాలా మంది వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ప‌ద్ధ‌తినే చాలా మంది ఎంపిక చేసుకుంటున్నారు. వ‌ర్టిక‌ల్ సాగు ద్వారా లాభాలు కూడా గ‌డిస్తున్నారు. ఈ సాగు ద్వారా కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, ఇత‌ర పంట‌ల‌ను పండిస్తున్నారు. సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లో ఈ సాగును చేయ‌డంతో మార్కెట్‌లో కూడా ఈ పంట‌ల‌కు భారీ డిమాండ్ ఉంది. వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త పెరిగి.. రైతుల‌కు ఆదాయం కూడా భారీగా స‌మ‌కూరుతుంది వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం ద్వారా. ఈ క్ర‌మంలో వ‌ర్టిక‌ల్ వ్య‌వ‌సాయం చేసే వారికి కేంద్ర ప్ర‌భుత్వం రూ. 2 కోట్ల వ‌ర‌కు రుణాలు అందిస్తోంది.

ఈ రుణాల‌కు అర్హులు ఎవ‌రు..?

– రైతులు( Farmers )
– రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(FPOs)
– స్వ‌యం స‌హాయ‌క బృందాలు(SHGs)
– ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు (PACS)
– వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలు (APMC)
– జేఎల్‌జీ గ్రూపులు(JLGs)

ద‌ర‌ఖాస్తుకు కావాల్సిన ధృవ‌ప‌త్రాలు ఇవే..

– బ్యాంకు లోన్ అప్లికేష‌న్ ఫార్మ్
– పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
– ఓట‌ర్ ఐడీ లేదా పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్
– ఆదాయ‌పు ప‌న్ను చెల్లించే వారు.. గ‌త మూడేండ్ల ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిటర్న్స్ స‌మ‌ర్పించాలి
– ల్యాండ్ ఓన‌ర్‌షిప్ రికార్డ్స్(టైటిల్ డీడ్ లేదా లీజ్ డీడ్)
– కేవైసీ డాక్యుమెంట్
– బ్యాంక్ స్టేట్‌మెంట్
– డీపీఆర్( Detailed Project Report)

ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లోనే..

అర్హ‌త క‌లిగిన రైతులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో పై ధృవ‌ప‌త్రాలు క‌లిగి ఉండాలి. మీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమగ్ర వివరాలతో DPR (Detailed Project Report) ఉండాలి. మీకు ఉన్న భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు చూపించాలి. బ్యాంక్ సూచించిన Title Investigation Report (TIR) అవసరం. ఇక దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2 రోజుల్లోపు దానిని ధృవీకరిస్తుంది. ఆ తర్వాత మీ బ్యాంక్‌కు సమాచారం పంపబడుతుంది. మీ బ్యాంక్‌ కూడా ధృవీకరణ ప్రక్రియ పూర్తిచేస్తుంది. 60 రోజుల్లోపు మీ లోన్ ఆమోదం జరుగుతుంది.

ద‌ర‌ఖాస్తు, ఇత‌ర వివ‌రాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://agriinfra.dac.gov.in లాగిన్ అవ్వండి. ఈ సైట్‌ను ఓపెన్ చేసిన వెంట‌నే.. బెనిఫిష‌రీ కాలమ్ వ‌ద్ద క్లిక్ చేయండి. అందులో రిజిస్ట్రేష‌న్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. అక్క‌డ క్లిక్ చేసి రైతు త‌న వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ విష‌యంలో ఏవైనా సందేహాలు ఉంటే.. అదే బెనిఫిష‌రీ కాల‌మ్‌లో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ వీడియోను ఇంగ్లీష్‌లో పొందుప‌రిచారు. ఆరు నిమిషాల నిడివి గ‌ల ఆ వీడియోను చూస్తే ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఇదే బెనిఫిష‌రీ కాల‌మ్‌లోనే కావాల్సిన ధృవ‌ప‌త్రాలు, బ్యాంకుల వివ‌రాలు, ప్రాజెక్టుల వివ‌రాల‌ను పొందుప‌రిచారు.

ద‌ర‌ఖాస్తుకు సంబంధించిన వీడియో లింక్ ఇది..
https://agriinfra.dac.gov.in/Content/video/Agri_pro_English_6.mp4

రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవే..

– క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు
– షెడ్యూల్డ్ కో ఆప‌రేటివ్ బ్యాంకులు
– రీజ‌న‌ల్ రూర‌ల్ బ్యాంకులు
– స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
– నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు
– డీసీసీబీలు