రేవంత్ నిర్ణయానికి రెండు వైపులా పదును!
కాళేశ్వరం కమిషన్‌పై చర్చ, సీబీఐ విచారణకు ఆదేశించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.

- బీజేపీ కోర్టులోకి బంతిని నెట్టిన కాంగ్రెస్
- కాళేశ్వరం కేసులో విచారణ చేస్తారా?
- కారు రాజీపడితే వదిలిపెట్టేస్తారా?
- అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వంపైనే
- ఇప్పటికే బీఆరెస్‌తో లింకుపై ఆరోపణలు
- ఏది జరిగినా కాంగ్రెస్‌కే అడ్వాంటేజ్!
- రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా చర్చలు
హైదరాబాద్,సెప్టెంబర్ 1 (విధాత): కాళేశ్వరం కమిషన్‌పై చర్చ, సీబీఐ విచారణకు ఆదేశించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా కలిసి వచ్చే అంశమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన నాయకుడిగా పేరు వచ్చిందని అంటున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా పార్టీలో పై చేయిసాధించారన్న అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తాను స్వయంగా ఇంజినీర్ అవతారం ఎత్తి, తన మెదడును రంగరించిన నిర్మించానని చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైన మేడిగడ్డ బరాజ్.. ఆయన హయాంలోనే కుంగిపోయింది. ఆపైన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలోనూ బుంగలు తేలాయి. ఇది బీఆరెస్‌ను అప్పటికే రాజకీయంగా భారీ దెబ్బతీసింది. ఎన్నికల్లో ఓటమికి అది కూడా ఒక కారణమైంది. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల నీళ్లు లేకుండానే ఎల్లంపల్లి ద్వారా సాగునీటిని అందించింది. దీని ద్వారా అప్పటిదాకా తన బలంగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే బెలూన్‌కు గాలి తీసేసి.. దానికి విలువ లేదని ఆచరణలో చూపారని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం కుంగుబాటుపై రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అది ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా బీఆరెస్ అవినీతిని సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగిందనే చర్చ నడుస్తున్నది. కేటాయించిన సమయం కంటే ఎక్కువ సమయమే మాట్లాడేందుకు బీఆరెస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే.. తన వాదనను సమర్థంగా వినిపించుకోలేకపోయిన బీఆరెస్.. సంబంధం లేని అంశాలతో దాడి చేసేందుకు విఫలయత్నం చేసి భంగపడిండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కమిషన్ రూపంలో రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్త చర్య
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాజకీయ రచ్చ కొనసాగుతున్న సమయంలోనే దీనిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ పదే పదే డిమాండ్ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించకపోవడం వెనుక మతలబేంటని నిలదీసింది. నిజానికి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే బీఆరెస్, బీజేపీ మధ్య లాలూచీ ఏర్పడే అవకాశాలు ఉంటాయన్న చర్చలు అప్పట్లోనే నడిచాయి. ఈ నేపథ్యంలో సమయం తీసుకున్న రేవంత్ రెడ్డి.. ముందుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం ఏం జరిగిందనేది వెలికితీసి, ప్రజల ముందు ఉంచారని, ఇదే బీఆరెస్‌కు అతిపెద్ద రాజకీయ దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. తాను అనుకున్నది సాధించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సింపుల్‌గా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చూపుతూ ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతున్నట్టు ప్రకటించారు. దీంతో అందరి దృష్టి బీజేపీవైపు మళ్లింది. తాను ముందు నుంచీ అడుగుతున్నట్టుగా సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దించి, సాక్షాత్తూ మోదీ సైతం చేసిన ఆరోపణలపై నిగ్గుదేల్చాల్సి ఉంది. ఈ పని బీజేపీ చేస్తుందా? సాంకేతిక అంశాల మాటున తప్పుకొంటుందా? అనే చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ సీబీఐ విచారణకు స్వీకరించకపోయినా, స్వీకరించి, తూతూ మంత్రంగా నడిపినా బీజేపీ, బీఆరెస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
విచారణకు ఆధారాలు సిద్ధం
విచారణకు కావాల్సిన వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నివేదిక రూపంలో సిద్ధం చేసింది. ఈ నివేదికలో ఆధారాలు, సిఫారసులు, నిజా నిజాలపై మరింత లోతుగా విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగితే ఇకనుంచి ఈ అంశంలో బీజేపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి చేశారని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీఐ విచారణ ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైకి రేవంత్ రెడ్డి నెట్టారనేది అర్థమవుతున్నది. విచారణలో ఏమాత్రం ఆలస్యం చేసినా, అలసత్వం వహించినా, బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించినా బద్నాం అయ్యేది బీజేపీ నే అని కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య చర్చ మొదలైంది.
ఊహించని పరిణామం
కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వెలుగులోకి రాకుండా, చర్చ జరుగకుండా, విచారణకు అవకాశం లేకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వేసిన ఎత్తులు రేవంత్ రెడ్డి ముందు నిలువ లేకపోయిందన్న చర్చ జరుగుతోంది. కమిషన్ విచారణను న్యాయపరంగా అడ్డుకోవాలని చూసిన బీఆర్ఎస్ పెద్దలకు ఇది పెద్ద షాక్ గా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యల్లో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణకు ఆదేశించవచ్చని, లేదా శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయవచ్చని బీఆర్ఎస్ పెద్దలు ఊహించగా, దీనికి భిన్నంగా ఆదివారం అర్ధరాత్రి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించడంతో గులాబీ నేతలు అవాక్కయ్యారు. ఎవరి ఊహకు ఏమాత్రం అందని విధంగా రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి బీఆర్ఎస్ ను ప్రత్యక్షంగా, బీజేపీ నేతలను పరోక్షంగా ఇరుకున పెట్టారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు వైపులా పదునుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), వ్యాప్కోస్ వంటి సంస్థలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఆర్థిక నిబంధనల ఉల్లంఘనలు వంటి అంశాలు ఇమిడి ఉండడంతో సీబీఐ దర్యాప్తు చేయించక తప్పదని ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇరుకున పడ్డ బీఆర్ఎస్, బీజేపీ
కాళేశ్వరం కమిషన్ నివేదిక తరువాత కేసీఆర్, హరీశ్ రావు తొలుత కమిషన్ నివేదిక చెల్లదని, రద్ధు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ స్టే రాలేదు. ఆ తరువాత నివేదికను అసెంబ్లీ ముందు పెట్టవద్దని, చర్యలు తీసుకోవద్దని కోరుతూ మరోసారి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. దానిపైనా ఉపశమనం లభించలేదు. ఆదివారం అర్ధరాత్రి సీబీఐ విచారణకు అప్పగిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించగా.. సోమవారం పొద్దున్నే మళ్లీ హైకోర్టు తలుపు తట్టారు. సీబీఐ విచారణను ఆపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరగా, హైకోర్టు ఆపలేమని స్పష్టం చేసింది.
అనుకున్నదొక్కటి..
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ తలనొప్పి మరోలా ఉందని సీనియర్ నాయకుడొకరు అన్నారు. అనుకున్నది ఒకటి, అయ్యింది మరోటి అన్న చందంగా కేసీఆర్, హరీశ్ నెత్తినోరు కొట్టుకుంటున్నారన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా ఊపిరి ఆడకుండా చేశారని బీఆరెస్ ముఖ్య నాయకత్వం అంతర్గత భేటీల్లో చర్చించుకున్నట్టు సీనియర్ జర్నలిస్ట్ ఒకరు చెపుతున్నారు. జరగాల్సింది జరిగింది, ఇక తమ పరిధిలో ఏమి లేదని, సీబీఐ విచారణకు సిద్ధం కావాల్సిందేనా అంటూ నిట్టూర్చినట్లు తెలుస్తోంది. పదే పదే కోర్టుకు వెళ్లినా ఉపయోగం లేకపోవడం బీఆరెస్ నేతలకు మింగుడుపడటం లేదని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉపశమనం లభించే అవకాశం లేదనే అభిప్రాయాలు బీఆరెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
చిత్తయ్యేది ఏ పార్టీ?
రేవంత్ రెడ్డి అకస్మిక నిర్ణయంతో రాష్ట్రంలో ఏ పార్టీ చిత్తవుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని కాంగ్రెస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. సీబీఐ నిష్పాక్షికంగా, నిజాయతీతో దర్యాప్తు చేస్తే.. కాళేశ్వరం కుంభకోణం నుంచి బీఆర్ఎస్ నేతలు, ఐఏఎస్ లు, ఇంజినీర్లు బయట పడటం అసాధ్యమంటున్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తై, పక్కా ఆధారాలు ఉన్నందున సీబీఐ విచారణకు ఏడాది, రెండేళ్లకు మించి సమయం తీసుకోకపోవచ్చని మాజీ అధికారులు చెపుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పెద్దలు బీజేపీతో లోపాయకారి చర్చలు జరిపితే కేసు మలుపులు తిరగవచ్చని, మసకబారవచ్చన్న వాదనలు కూడా బలంగా విన్పిస్తున్నాయి. అయితే బీజేపీ ఢిల్లీ నేతలు కేసీఆర్‌ను నమ్ముతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియాగాంధీనే మోసం చేసిన కేసీఆర్‌ను నమ్మితే మనమూ మోసపోతామని బీజేపీ ఢిల్లీ నాయకులకు ఒకరిద్దరు ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఏదైనా చీకటి ఒప్పందం జరిగితే దర్యాప్తు నెమ్మదిస్తుందని, తద్వారా బీజేపీ తెలంగాణ ప్రజల ముందు విశ్వాసం కోల్పోతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు అన్నారు. రేవంత్ రెడ్డి వదిలిన సీబీఐ దర్యాప్తు బాణం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి శాపంగా మారుతుందో చూడాలి.