Terrace Gardening | ఇంటి మేడపైనే కూరగాయల సాగు.. నెలకు 5వేలు ఆదా చేస్తున్న కేరళ గృహిణి

Terrace Gardening | నగరాల్లో దొరికే కూరగాయలతో విసుగుచెందిన కేరళ గృహిణి.. సొంతంగా సేంద్రియ సాగు మొదలుపెట్టింది. ఇంటి మేడపైనే చిన్న తోటను ఏర్పాటు చేసుకుని తన కుటుంబానికి కావాల్సిన కూరగాయలను పండించుకుంటుంది.

Terrace Gardening | నగరాల్లో ఉండే వారికి తాజా కూరగాయలు దొరకడం కష్టమే అని చెప్పాలి. ఒకవేళ దొరికినా వాటిని ఎన్ని రసాయనాలతో పండించి ఉంటారో తెలియదు. అలా మార్కెట్‌లో దొరికే కూరగాయల రుచి, స్వచ్ఛత నచ్చక విసుగుచెందిన కేరళ మహిళ.. సొంతంగా సేంద్రియ సాగు మొదలుపెట్టింది. ఇంటి మేడపైనే చిన్న తోటను ఏర్పాటు చేసుకుని తన కుటుంబానికి కావాల్సిన కూరగాయలను పండించుకుంటుంది. మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం కూడా ఆర్జిస్తూ.. ఎంతోమందికి ఆదర్శనంగా నిలుస్తోంది.

కేరళలోని వెల్లరాండ గ్రామానికి చెందిన పద్మ పల్లెటూరిలో పుట్టిపెరిగింది. రైతు కుటుంబంలో జన్మించిన పద్మ చిన్నతనం నుంచి తండ్రితో కలిసి పొలాలకు వెళ్లేది. అక్కడ తన నాన్న ద్వారా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు ఎలా పండించాలో నేర్చుకుంది. స్కూల్ అయిపోయాక ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేది. కానీ సురేశ్‌ ఎట్టన్‌తో వివాహం అనంతరం ఆమె తిరువనంతపురం వెళ్లాల్సి వచ్చింది. చిన్నతనం నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగిన పద్మకు సిటీ జీవితం కొత్తగా అనిపించింది. ముఖ్యంగా గ్రామాల్లో లభించే తాజా కూరగాయలు, వాటి రుచి, స్వచ్ఛత సిటీలో కనిపించకపోవడం ఆమెను ఎంతో కలిచివేసింది. సిటీలో రసాయనాలతో నిండి కూరగాయలు తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకునే బదులు తానే సొంతంగా కూరగాయలు పండించాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే టెర్రస్‌పై చిన్న గార్డెన్‌ను ఏర్పాటు చేసుకుంది. అలా చిన్నగా మొదలైన ఆలోచన ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారింది.

ప్రస్తుతం పద్మ 500 చదరపు అడుగుల టెర్రస్‌పై 200కి పైగా మొక్కలను పెంచుతోంది. టమాట, బెండకాయ, వంకాయ, బీన్స్, మిరపకాయలు, కీర దోసకాయలు, కాలీఫ్లవర్, కరివేపాకు వంటి 20 రకాల కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తోంది. గత 12 ఏళ్లుగా కూరగాయల సాగు చేస్తూ తన కుటుంబానికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, ఆలుగడ్డలు, చింతపండు తప్ప మిగతా అన్ని కూరగాయాలు తమ టెర్రస్‌పైనే పండిస్తోంది.

పద్మ టెర్రస్ గార్డెన్‌లో ఎక్కడా రసాయన ఎరువులు కనిపించవు. వర్మీకంపోస్టు, ఆవుపేడ, కోడి ఎరువు, బోన్ మీల్, వేప పిండి వంటి పూర్తిగా సహజసిద్ధమైన ఎరువులతో మొక్కలకు పోషకాలను అందిస్తోంది. అలాగే పురుగులమందులకు బదులు ఇంట్లో తయారుచేసిన జీవామృతాలను ఉపయోగిస్తోంది. సార్డిన్ చేపలను చిన్న ముక్కలుగా కోసి, అందులో బెల్లం కలిపి, గాలి చొరబడని డబ్బాలో 45 రోజుల పాటు ఉంచి, ఆ తర్వాత ద్రావణాన్ని నీటిలో కలిపి మొక్కలకు పురుగులమందులా పిచికారీ చేస్తానని పద్మ వివరించింది.

పద్మ సురేశ్ తమ కుటుంబానికి సరిపోయిన తర్వాత మిగిలిన కూరగాయలను అమ్మి అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తోంది. ప్రతి ఆదివారం స్థానికంగా జరిగే సేంద్రియ రైతు బజార్‌లో పద్మకు ప్రత్యేక స్టాల్ ఉంటుంది. అక్కడ ఆమె పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ‘రైతు బజార్‌లో నేను వెళ్లిన ఒక గంటలోనే మొత్తం కూరగాయలు అమ్ముడైపోతాయి. వారానికి రూ.వెయ్యి వరకు ఆదాయం కూడా వస్తుంది’ అని పద్మ చెప్పింది. మార్కెట్‌లో కూరగాయలు కొనాల్సిన అవసరం తగ్గడంతో నెలకు సుమారు రూ.5 వేల వరకు ఆదా అవుతోందని తెలిపింది.

ఈ టెర్రస్ గార్డెన్ కేవలం కూరగాయల వనరు మాత్రమే కాదని.. తన చిన్ననాటి గ్రామీణ జీవనాన్ని గుర్తుచేసే అనుబంధమని పద్మ చెబుతోంది. ఈ మొక్కల మధ్య గడిపితే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్టే మరిచిపోతానని భావోద్వేగానికి గురైంది.

Read More:

Terrace Garden | మట్టి లేకుండానే టెర్రస్‌పై గార్డెనింగ్.. సమ్మర్‌లో ఏసీ అవసరం లేకుండా చేసిన 70 ఏళ్ల వృద్ధుడి ఆలోచన!

రంగారెడ్డి జిల్లాలో ‘అవ‌కాడో’ సాగు.. ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..!

Latest News