Vermicompost Business | వర్మీకంపోస్టు తయారీ.. రూ. 20 వేల పెట్టుబడితో ఏడాదికి రూ. 2 కోట్ల టర్నోవర్
Vermicompost Business | ఐటీలో డిప్లొమా చేసిన ఓ వ్యక్తి.. నిర్మాణ సంస్థలో పని చేసేవారు. కానీ చాలిచాలనీ జీతాలతో ఆర్థిక స్థిరత్వం సంపాదించలేకపోయాడు. కుటుంబ సభ్యులను కూడా ఉన్నతంగా చూసుకోలేకపోయాడు. చివరకు ఆ ఉద్యోగాన్ని మానేసి.. వర్మీకంపోస్టు బిజినెస్( Vermicompost Business )పై దృష్టి సారించాడు. కేవలం రూ. 20 వేల పెట్టుబడితో రూ. 2 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాడు. వర్మీకంపోస్టు తయారీదారు ధర్మీందర్ లడ్డీ( Dharminder Laddi ) గురించి తెలుసుకోవాలంటే పంజాబ్( Punjab )లోని మొహలీ( Mohali ) వెళ్లాల్సిందే.
Vermicompost Business | పంజాబ్( Punjab ) కు చెందిన ధర్మీందర్ లడ్డీ( Dharminder Laddi ) మొహలీ( Mohali )లోని ఓ నిర్మాణ సంస్థలో పని చేసేవారు. నెలకు రూ. 35 వేల జీతం. 15 ఏండ్లు ఈ ఉద్యోగం చేసినప్పటికీ ఎలాంటి ఆర్థిక స్థిరత్వం సాధించలేదు. ఇంక్రిమెంట్లు కూడా లేవు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు కూడా సమయం దొరకడం లేదు. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల మధ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక ఏడాది తర్వాత రూ. 20 వేల పెట్టుబడితో వర్మీకంపోస్టు బిజినెస్( Vermicompost Business ) ను ప్రారంభించాడు. ప్రస్తుతం 900 టన్నులకు పైగా వర్మీకంపోస్టును ఉత్పత్తి చేస్తూ ఏడాదికి రూ. 2 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు.
ఐటీలో డిప్లొమా చేసిన ధర్మీందర్ లడ్డీ.. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. ఏం బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆన్‌లైన్‌లో శోధించాడు. ఈ క్రమంలో ఆయనకు పశుపోషణ, ఇతర వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలపై శిక్షణా కార్యక్రమాలు కంటబడ్డాయి. దీంతో మొహలీలోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో చేరిపోయాడు. మేకలు, చేపలు, పందుల పెంపకం వంటి వాటితో పాటు వ్యవసాయ పద్ధతులపై కూడా శిక్షణ ఇచ్చారు. అయితే మేకలు, చేపలు, పందుల పెంపకానికి మూలధనం ఎక్కువగా వెచ్చించాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలో ధర్మీందర్ వర్మీకంపోస్టుపై దృష్టి సారించాడు.
ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రజలు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో వర్మీకంపోస్టుకు డిమాండ్ ఉందన్న విషయాన్ని ధర్మీందర్ గ్రహించాడు. దీంతో ఆవుపేడ, వానపాములను ఉపయోగించి వర్మీకంపోస్టు తయారు చేసేందుకు పూనుకున్నాడు.
రూ. 20 వేల పెట్టుబడితో.. రెండు కంపోస్టు బెడ్లు
2016 మే నెలలో ధర్మిందర్ కేవలం రూ. 20 వేల పెట్టుబడితో.. వర్మీకంపోస్టు యూనిట్‌ను ప్రారంభించాడు. ఇక రెండు బెడ్లను 30 అడుగులు × 4 అడుగులు × 1.5 అడుగులతో ఏర్పాటు చేశాడు. ఇందుకు రూ. 10 వేలు ఖర్చు అయింది. ఇక రాజస్థాన్ నుంచి కిలో వానపాములను రూ. 300 చొప్పున కొనుగోలు చేశాడు. రూ. 9 వేలు వెచ్చించి దాదాపు 60 కిలోల వానపాములను కొనుగోలు చేశాడు. రూ. 1500లతో ఒక ట్రాలీ ఆవుపేడను సేకరించాడు.
తొలి విడతలోనే 1200 కిలోల వర్మీకంపోస్టు
దాదాపు మూడు నెలల తర్వాత వర్మీకంపోస్టును ఉత్పత్తి చేయగలిగాడు ధర్మీందర్. ఒక్కో బెడ్ నుంచి 600 కిలోల వరకు వర్మీకంపోస్టు ఉత్పత్తి అయింది. మొత్తంగా తొలి విడతలోనే 1200 కిలోల వర్మీకంపోస్టు ఉత్పత్తి చేయగలిగాడు.
ఉచితంగా అందజేసి..
ఇక ఉత్పత్తి అయిన వర్మీకంపోస్టును ధర్మీందర్ అమ్మలేదు. ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకునే వారికి, నర్సరీలకు ఉచితంగా వర్మీకంపోస్టును సరఫరా చేసి.. దాని నాణ్యతను పరీక్షించాలని కోరాడు. మొత్తానికి మొక్కల ఎదుగుదల అద్భుతంగా ఉంది. దీంతో స్వల్ప కాలంలోనే నర్సరీలు ఈ వర్మీకంపోస్టుకు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. ఒక్కో నర్సరీ వారు 50 కిలోల వరకు ఆర్డర్ ఇచ్చేవారు.
ఏడాదిలోనే 40 బెడ్లకు విస్తరణ..

ఈ డిమాండ్‌తో ధర్మిందర్ 2016లోనే మరో అర ఎకరం భూమిని లీజుకు తీసుకున్నాడు. దాదాపు 40 బెడ్లకు విస్తరించాడు. తదుపరి ఉత్పత్తుల్లో లాభాలు గడించాడు. ఆ లాభాలను మరింత విస్తరణ కోసం ఉపయోగించాడు.
నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు..
తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ.. చివరికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమినంతా వర్మీకంపోస్టు ఉత్పత్తికే వినియోగిస్తున్నాడు. సగటున రోజుకు 3 నుంచి 5 టన్నుల వరకు వర్మీకంపోస్టును ఉత్పత్తి చేస్తున్నాడు. ఏడాదికి 900 టన్నులకు పైగా ఉత్పత్తి ఉంది. ఎకరానికి 200 టన్నుల వరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాడు.
ఏడాదికి రూ. 2 కోట్ల టర్నోవర్..
బల్క్‌లో అయితే కిలో రూ. 6 చొప్పున, రిటైల్ అమ్మకాలు అయితే కిలో రూ. 10 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నాడు. ఆన్‌లైన్ అమ్మకాల్లో కిలోకు రూ. 60 నుంచి రూ. 70 వరకు వస్తుందని ధర్మీందర్ తెలిపాడు. ఇక వానపాములను కూడా విక్రయిస్తున్నాడు. కిలో వానపాములను రూ. 150 నుంచి రూ. 300 వరకు డిమాండ్‌ను బట్టి విక్రయాలు జరుపుతున్నాడు. మొత్తంగా రూ. 20 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు ఏడాదికి రూ. 2 కోట్లు గడిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు ధర్మీందర్ లడ్డీ.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram