Maoists| ఏపీలో మరో ఎన్ కౌంటర్..ఏడుగురు మావోయిస్టుల మృతి

ఏపీ మన్యం ఏజెన్సీలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఒక రోజు వ్యవధిలో చోటుచేసుకున్న మరో ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లుగా ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు.

Maoists| ఏపీలో మరో ఎన్ కౌంటర్..ఏడుగురు మావోయిస్టుల మృతి

అమరావతి : ఏపీ( Andhra Pradesh)మన్యం ఏజెన్సీలో మారేడుమిల్లి( Maredumilli forest) అటవీ ప్రాంతంలో ఒక రోజు వ్యవధిలో చోటుచేసుకున్న మరో ఎన్ కౌంటర్(Encounter)లో ఏడుగురు మావోయిస్టులు(7 Maoists) మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లుగా ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో శ్రీకాకుళానికి చెందిన మావోయిస్టు జోగారావు అలియాస్‌ టెక్‌ శంకర్‌ ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వారిని జ్యోతి, సురేష్, లోకేష్, షైను, అనిత, షమ్మిలుగా గుర్తించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చత్తీస్ గఢ్ లో భద్రతాబలగాల ఒత్తిడితో మావోయిస్టులు ఏపీలోకి వచ్చినట్లుగా తెలిపారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు చనిపోయారని.. మిగిలిన మావోయిస్టులు ఎవరైన ఉంటే లొంగిపోవడం మంచిదన్నారు. 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ ను ముగిస్తామని.. ఈ లోగా ఎవరికైనా ఎన్‌కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చునని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డులను వారికే ఇచ్చి.. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కొన్నాళ్లు షెల్టర్ తీసుకుని తర్వాత పక్క రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు కొనసాగించాలన్న ఆలోచనతో వారు ఇక్కడికి వచ్చినట్లుగా భావిస్తున్నామని తెలిపారు.

నిన్న హిడ్మా హతం

నిన్నమంగళవారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి టైగర్​జోన్​దగ్గర నల్లూరు జలపాతం సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య రాజే, డీసీఎం లక్ష్మణ్​, పీపీసీఎం కమ్లూ, పీపీసీఎం మల్లా, హిడ్మా గార్డు దేవే మృతి చెందారు. వాళ్ల మృతదేహాలను మారేడుమిల్లి ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మరో 50మంది మావోయిస్టుల అరెస్టు 

మరోవైపు ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేసినట్లుగా ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా వెల్లడించారు. వీరిలో స్పెషల్ జోనల్‌ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్‌ మెంబర్లు 23 మంది, డివిజినల్‌ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఎక్కడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశాం. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. వారిలో రావులపాలెం దగ్గర సరోజ్ అనే మావోయిస్టు అరెస్టయ్యాడని.. అతను హిడ్మా దళానికి చెందిన మావోయిస్టుగా గుర్తించినట్లుగా తెలిపారు.