విధాత: ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి నుంచి 200టీఎంసీల మిగులు జలాల సద్వినియోగం పేరుతో కొత్త ప్రాజెక్టు నిర్మాణం కోసం గట్టి పట్టుదలనే కనబరుస్తున్నారు. ముందుగా పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్రంలోని తమ భాగస్వామ్య ఎన్డీఏ ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తెచ్చి..తెలంగాణ అభ్యంతరాలతో వెనక్కి తగ్గిన చంద్రబాబు..ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్…పేరు మార్పుతో ముందుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పేర్కొన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పోలవరం-నల్లమలసాగర్‌(పీఎన్‌) లింక్‌ ప్రాజెక్టు పేరుతో డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం విశేషం.

పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందంటున్న చంద్రబాబు.. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల వాటా నుంచి కాకుండా సముద్రంలోకి వెళ్లే 200టీఎంసీల మిగులు జలాలను రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకోవాలని భావిస్తున్నామంటు చెబుతున్నారు. పీఎన్ లింక్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రంపై ఒత్తిడి పెడుతున్నారు. అయితే ఏపీ కొత్తగా తెరపైకి తెచ్చిన పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టు ద్వారా ఇటు కృష్ణా నుంచి బనకచర్లకు.. అటు గోదావరి నుంచి నల్లమలసాగర్​కు నీళ్లను తన్నుకుపోయే ప్రమాదం ఉందని తెలంగాణ జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్​లో నల్లమలసాగర్ నుంచి బనకచర్లకూ విస్తరించే అవకాశాలూ ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మూడో లింక్ లో మార్పుతో పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టు

పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టును ముందుకు తెచ్చింది. పోలవరం–బనకచర్ల లింక్​లో భాగంగా పోలవరం కుడి కాల్వ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తొలి దశలో నీటిని తరలించాలని ఏపీ గతంలో ప్రయత్నించింది. అక్కడి నుంచి రెండో దశలో నాగార్జునసాగర్​కుడి కాల్వలోకి.. అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి నీటిని ఎత్తిపోయాలని భావించింది. ఇక, మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్​కు నీటిని తరలించాలని ప్లాన్ చేసింది. గత నెలలో దీనికోసం డీపీఆర్ తయారీకి టెండర్లనూ పిలిచింది. అయితే తెలంగాణ నుంచి వ్యతిరేకత నేపథ్యంలో టెండర్లను వాపస్ తీసుకుంది. ఆ ప్రాజెక్టు స్థానంలో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును తెచ్చింది. అయితే పీబీ లింక్​లోని తొలి రెండు దశలను అలాగే కొనసాగిస్తూ.. మూడో దశను మాత్రమే స్కీమ్ నుంచి ఎత్తేసింది.

రెండో దశ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమలసాగర్​కు నీటిని తరలించే ప్లాన్ తో పీఎన్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. ఇందుకు రూ.58 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. బనకచర్ల లింక్​లో భాగంగా రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు 200 టీఎంసీల నీటిని తరలించాలని ప్లాన్ వేసిన ఏపీ.. ఇప్పుడు పోలవరం–నల్లమలసాగర్ లింక్​లోనూ రోజూ 2 టీఎంసీల చొప్పున నీటిని తరలిస్తామని స్పష్టం చేసింది. బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యం యథావిధిగా150 టీఎంసీలను అలాగే ఉంచింది. పీఎన్‌ లింక్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీకి రూ.9కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీ జలవనరులు శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 27న బిడ్‌ డాక్యుమెంట్లను అందుబాటులో పెట్టడంతోపాటు, డిసెంబర్‌ 11వ తేదీ వరకు టెండర్లు పిలుస్తూ ప్రకటన ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

Mallika Sukumaran | మాలీవుడ్‌లో కలకలం…కుమారుడి కెరీర్‌పై కుట్రలు జరుగుతున్నాయంటూ తల్లి ఆరోప‌ణ‌.. చేస్తున్న‌దెవ‌రు?
Harish Rao | ‘చిల్లర మాటలు.. చీప్ పాలిటిక్స్’.. సీఎం రేవంత్ పై హరీశ్ ఫైర్