‘త‌మ్ముడి’ కోసం ‘అన్న‌య్య‌’.. జ‌న‌మే జ‌యం అని న‌మ్మే ‘జ‌నసేనా’నిని గెలిపించండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు కోసం అన్న‌య్య చిరంజీవి ఓ సందేశం ఇచ్చారు. త‌న గురించి కంటే జ‌నం గురించి ఎక్కువ‌గా ఆలోచించే మ‌న‌స్తత్వం ఉన్న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఈ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పిఠాపురం ప్ర‌జ‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి కోరారు

‘త‌మ్ముడి’ కోసం ‘అన్న‌య్య‌’.. జ‌న‌మే జ‌యం అని న‌మ్మే ‘జ‌నసేనా’నిని గెలిపించండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు కోసం అన్న‌య్య చిరంజీవి ఓ సందేశం ఇచ్చారు. త‌న గురించి కంటే జ‌నం గురించి ఎక్కువ‌గా ఆలోచించే మ‌న‌స్తత్వం ఉన్న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఈ ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పిఠాపురం ప్ర‌జ‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి కోరారు. ప‌వ‌న్ సినిమాల్లోకి బ‌ల‌వంతంగా వ‌చ్చాడు.. కానీ రాజ‌కీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వ‌చ్చాడు. జ‌న‌మే జ‌యం అని న‌మ్మే జ‌న‌సేనాని ఏం చేయ‌గ‌ల‌డో చూడాలంటే పిఠాపురం ప్ర‌జ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవ‌కుడిగా, సైనికుడిగా అండ‌గా నిల‌బ‌డుతాడు.. మీ కోసం క‌ల‌బ‌డి మీ క‌ల‌ల‌ను నిజం చేస్తాడు అని చిరు త‌న సందేశంలో పేర్కొన్నారు.

చిరంజీవి సందేశం.. ఆయ‌న మాట‌ల్లోనే..

అమ్మ క‌డుపున ఆఖ‌రి వాడిగా పుట్టినా అంద‌రికీ మంచి చేయాలి.. మేలు జ‌ర‌గాలి అనే విష‌యంలో నా త‌మ్ముడు ముందుంటాడు. త‌న గురించి కంటే జ‌నం గురించి ఎక్కువ‌గా ఆలోచించే మ‌న‌స్త‌త్వం నా త‌మ్ముడు క‌ల్యాణ్‌ది. ఎవ‌రైనా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేయాల‌నుకుంటారు. కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న సొంత సంపాద‌న‌ను కౌలు రైతుల క‌న్నీళ్లు తుడిచేందుకు ఖ‌ర్చు పెట్ట‌డం, స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌కు తెగించి పోరాడే జ‌వాన్ల కోసం పెద్ద మొత్తం అందించ‌డం, మ‌త్స్య‌కారుల‌కు సాయం చేయ‌డం చూస్తుంటే ఇలాంటి నాయ‌కుడు క‌దా జ‌నాల‌కు కావాల్సింది అనిపిస్తోంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే సినిమాల్లోకి త‌ను బ‌ల‌వంతంగా వ‌చ్చాడు. రాజ‌కీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వ‌చ్చాడు. ఏ త‌ల్లికైనా త‌న కొడుకు క‌ష్ట‌ప‌డుతుంటే త‌న గుండె త‌రుక్కుపోతుంది. ఏ అన్న‌కైనా త‌న త‌మ్ముడు అన‌వ‌స‌రంగా మాట‌లు ప‌డుతుంటే బాధేస్తుంది. అలా బాధ ప‌డుతున్న నా త‌ల్లికి ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది త‌ల్లుల కోసం, వాళ్ల బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం చేసే యుద్ధం అమ్మా ఇది అని చెప్పాను. మ‌న బాధ కంటే అది ఎంతో గొప్ప‌ది అన్నాను. అన్యాయాన్ని ఎదురించ‌కుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వ‌ల్ల‌నే ప్ర‌జాస్వామ్యానికి మ‌రింత న‌ష్ట‌మ‌ని న‌మ్మి జ‌నం కోసం జ‌న సైనికుడ‌య్యాడు.

తాను బ‌లంగా న‌మ్మిన సిద్ధాంతం కోసం త‌న జీవితాన్ని రాజ‌కీయాల కోసం అంకితం చేసిన శ‌క్తిశాలి ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం శ‌క్తిని వినియోగించాలి అంటే చ‌ట్ట స‌భ‌ల్లో అత‌డి గొంతును మ‌నం వినాలి. జ‌న‌మే జ‌యం అని న‌మ్మే జ‌న‌సేనాని ఏం చేయ‌గ‌ల‌డో చూడాలంటే మీరు పిఠాపురం ప్ర‌జ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించాలి. మీకు సేవ‌కుడిగా, సైనికుడిగా అండ‌గా నిల‌బ‌డుతాడు. మీ కోసం క‌ల‌బ‌డి మీ క‌ల‌ల‌ను నిజం చేస్తాడు. పిఠాపురం వాస్త‌వ్యుల‌కు మీ చిరంజీవి విన్న‌పం. గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గెలిపించండి. జైహింద్ అని చిరంజీవి త‌న సందేశాన్ని ముగించారు.