CM Chandrababu | జగన్‌ మూడు ముక్కలాట.. మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు

మూడు రాజధానుల పేరుతో మాజీ సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడారని, అయిదేళ్ల తర్వాత మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాడని, ఇలాంటి వ్యక్తులకు ఓటేసిన వారు ఆలోచించుకోవాలని ఏపీ సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు విమర్శించారు

CM Chandrababu | జగన్‌ మూడు ముక్కలాట.. మూడు రాజధానుల పేరుతో రాజధాని లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు

ఏపీ అంటే అమరావతి.. పోలవరం
జగన్‌ విధ్వంసానికి గుర్తుగా ప్రజావేదిక శిథిలాలు
జగన్‌ పాలన ప్రారంభమైందే కూల్చివేతలతో
రాజకీయాలకు పనికిరాని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో ఐదేళ్లు చూశాం
అమరావతి సందర్శనలో సీఎం చంద్రబాబు
శంకుస్థాపన ప్రాంతంలో మట్టికి ప్రణమిల్లిన బాబు

విధాత, హైదరాబాద్‌ : మూడు రాజధానుల పేరుతో మాజీ సీఎం జగన్‌ మూడు ముక్కలాట ఆడారని, ఐదేళ్ల తర్వాత మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకు ఓటేసిన ఆలోచించుకోవాలని కోరారు. గురువారం నిర్మాణ రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. తొలుత ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్ధండరాయునిపాలెం వెళ్లారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన పవిత్ర మట్టి ప్రాంతాన్ని సందర్శించారు. పవిత్ర మట్టికి ప్రణమిల్లారు. మోకాళ్లపై కూర్చొని నమస్కరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి సందర్శించాక చాలా బాధేస్తోందని అన్నారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం అని అభివర్ణించారు. ఎవరూ పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టామని తెలిపారు. అమరావతి, పోలవరంతో మాకేం సంబంధం రాష్ట్ర ప్రజలు అనుకోవద్దన్న చంద్రబాబు.. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు. మాజీ సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో అసలు రాజధానే లేకుండా చేశారని విమర్శించారు. గతంలో ప్రజావేదికను కూల్చి జగన్ పాలన ప్రారంభించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. 70, 80 దేశాల్లో తెలుగు ప్రజలు అమరావతిని నాశనం చేయడంపై నిరసన తెలిపారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధానిని ధ్వంసం చేసిన వారి ఆటలు ఇక సాగబోవని స్పష్టం చేశారు.

రౌడీయిజం రాజకీయాల్లో లేకుండా చేస్తామని చెప్పారు. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 1631 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని పూర్తవుతుందనే నమ్మకంతో పోరాటాన్ని విరమించారని, వారి కష్టం, త్యాగం వృథా కాకుండా అమరావతి రాజధాని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రుషులు తపస్సులు చేసిన ప్రాంతం రుషికొండను వైసీపీ పాలకులు నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని, లెక్కలు చూపించకుండా ఎన్నో చోట్ల అప్పులు తీసుకొచ్చారని మండిపడ్డారు.

శిథిల ప్రజావేదికను జగన్‌ విధ్వంసానికి గుర్తుగా ఉంచుతాం

హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని శిథిల ప్రజా వేదికను జగన్‌ విధ్వంసానికి గుర్తుగా అలానే ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారని, లేకుంటే ఊరుకున్నారని, కానీ.. జగన్ మాదిరిగా విధ్వంసం చేయలేదని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ చెప్పినట్లుగా సెంట్రల్‌లో అమరావతిని ఏర్పాటు చేశామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రాజధానిపైన బురదజల్లే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూసి, సింగపూర్ కన్సార్టియంను తరిమేశారని విమర్శించారు. ఇక్కడి రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే వారిపై ఎన్నో అపవాదులు వేశారన్నారు. కొన్ని అల్లరిమూకలు ఇక్కడ ఏర్పాటు చేసిన నమూనాలను కూడా ధ్వంసం చేశాయని చెప్పారు.

పవిత్ర మట్టే కాపాడింది

పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవిత్రమట్టి చూసిన తర్వాత అదే అనిపించిందని అన్నారు. అమరావతి రైతులు వాటిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పారు. పైపులు, రోడ్డు, మట్టిని దొంగతనం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఎక్కడ కట్టిన బిల్డింగులు అలాగే ఉన్నాయని, ఐకానిక్ కట్టడాలన్నీ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన భవనాల్లో ఎలాంటి మార్పు చేయలేదని, పూర్తి కావాల్సిన ఎన్నో పనులు నిలిపివేశారని అన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్ల భవనాలు, అసెంబ్లీ బిల్డింగ్ ఉండాల్సిన చోట తుమ్మచెట్లు మొలిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పూర్తయి ఉంటే ఈ పాటికి నమూనా తరహాలో సజీవంగా కనిపించేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆనాడే స్పష్టమైన విధానం ప్రకటించామని, కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలోని ప్రాంతాల్లో 11 కేంద్రీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాల్సివుందన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేశారని, ఈ సంఖ్య కలిపితే వైసీపీకి వచ్చిన సీట్లకు సరిపోలుతోందని ఎద్దేవా చేశారు.

ఏపీకి వరం కావాల్సిన పొలవరాన్ని శాపంగా మార్చారు

పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేసిందని రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీరు వస్తుందనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని, అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నామని తెలిపారు. జగన్ తన విధానాలతో పోలవరాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. ఇటీవల ఎన్నికల్లో కూటమికి చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విజయం ప్రజలు కట్టబెట్టారని, వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని చెప్పారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత ఐదేళ్లు ప్రత్యక్షంగా చూశామన్నారు.

కేంద్ర నిధులతో పోలవరం కట్టి, నధులను అనుసంధానం చేసుకుంటే ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అంతకుముందు చంద్రబాబు పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంత రైతులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు రాజధాని శంకుస్థాపన ప్రాంతం, సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.