Srisailam Dam : శ్రీశైలం జలశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యుసీ టెక్నికల్ కమిటీ
శ్రీశైలం జలాశయాన్ని సీడబ్ల్యూసీ టెక్నికల్ కమిటీ పరిశీలించింది. డ్యామ్ భద్రత, ప్లంజ్ పూల్ పరిస్థితులపై సమీక్ష జరిపి నివేదికపై ఆసక్తి నెలకొంది.
విధాత : శ్రీశైలం జలాశయాన్ని మరోసారి సీడబ్ల్యుసీ డ్యామ్ సేఫ్టీ టెక్నికల్ కమిటీ సభ్యులు పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద అధికారులతో కేంద్ర డ్యామ్ సేఫ్టీ టెక్నికల్ కమిటీ సమావేశమైంది. జలాశయం గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, ప్లంజ్ పూల్, అప్రోచ్ రోడ్డు, సిలిండర్ల నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులను టెక్నికల్ కమిటీ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. డ్యామ్ నీటిమట్టం, గ్యాలరీ అప్రోచ్ రోడ్డు, ప్లంజ్ ఫుల్ సామర్ధ్యంపై టెక్నికల్ కమిటీ సభ్యులకు డ్యామ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిపై కమిటీ సభ్యుల సమీక్ష నిర్వహించింది.
గత ఏడాది మే నెలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) చేసిన సిఫార్సులు, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జలసంఘం (CWC) నిర్ణయం తీసుకుంది. ఇందులో సీడబ్ల్యూసీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (CSMRS), సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS), సంస్థలకు చెందినవారు సహా రెండు రాష్ట్రాల ఇంజినీర్లు, కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉన్నారు.
శ్రీశైలం డ్యామ్ కు మరమ్మతులు చేయాల్సిందే..!
గత ఏడాది ఏప్రిల్ లో సైతం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) బృందం శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించింది. ముఖ్యంగా డ్యామ్ భద్రతకు ముప్పుగా మారిన ‘ప్లంజ్ పూల్’ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఎన్డీఏస్ఏ బృందం స్పిల్‌వే దిగువన ఏర్పడిన భారీ గోతిని, పునాదుల పరిస్థితిని అధ్యయనం చేసి, డ్యామ్ బలోపేతానికి తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై నివేదిక సమర్పించింది.గత ఆరేళ్లుగా వివిధ కమిటీలు సిఫార్సులు చేసినా, ఆచరణలో జాప్యం జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
స్పిల్‌వే దిగువన 120-160 మీటర్ల లోతైన, భారీ గోతిని ఎన్డీఎస్ఏ బృందం గుర్తించింది. ఇది డ్యామ్ పునాదులకు ముప్పు కలిగిస్తోందని హెచ్చరించింది. మే 2025లో సమర్పించిన నివేదికలో తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. డ్యామ్ దిగువన రాతిపలకల స్థిరత్వాన్ని పెంచడానికి, కాఫర్ డ్యామ్ నిర్మించి, అత్యాధునిక సాంకేతికతతో మరమ్మతులు చేపట్టాలని సూచించింది.
టెక్నికల్ కమిటీ నివేదికపై సర్వత్రా ఆసక్తి
వర్షాకాలం వరదల సీజన్ ముగిసిపోయి వేసవిలో డ్యామ్ నీటి మట్టం తగ్గిన నేపథ్యంలో మరోసారి శ్రీశైలం డ్యామ్ పరిస్థితిని సీడబ్ల్యుసీ టెక్నికల్ కమిటీ పరిశీలించింది. గతంలోనే డ్యామ్ మనుగడపై ఎన్డీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు టెక్నికల్ కమిటీ ఎలాంటి సూచనలు చేయబోతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి :
Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Modi Assam Visit : తేయాకు తోటల్లో ప్రధాని మోదీ.. అస్సాం ఎన్నికల ప్రచార చిత్రం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram