Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ వాకౌట్ చేసింది. రేపు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

Amaravati Capital Bill : రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

విధాత : లోక్‌సభలో రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుకు లోక్ సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసింది. లోక్ సభ మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. రేపు రాజ్యసభలో అమరావతి చట్టబద్దత బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

బుధవారం కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో అమరావతిని రాజధానిగా చేర్చుతూ చట్ట సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా రెండు గంటల పాటు చర్చకు అనుమతించారు. అమరావతి చట్టబద్దత బిల్లుకు బీజేపీ సహా ఎన్డీఏ పార్టీలు, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్‌ లోక్‌సభలో చెప్పారు.ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, పురంధేశ్వరి, సీఎం రమేశ్, వైసీపీ నుంచి ఎంపీ మిధున్ రెడ్డిలు మాట్లాడారు. అమరావతి బిల్లుపై చర్చలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ సహా 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

అనుమానాలకు సమధానమే అమరావతి చట్టబద్దత బిల్లు

అమరావతి బిల్లుపై లోక్‌సభలో తెలుగులో మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతి బిల్లుకు అన్ని పార్టీలు మద్దతునివ్వాలని కోరారు. అమరావతి పవిత్ర భూమి అని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అమరావతి బిడ్డగా ఈ బిల్లుపై మాట్లాడడం నా అదృష్టం అని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 34 వేల ఎకరాల భూమి సేకరించాం అని గుర్తు చేశారు. చంద్రబాబు అంటే శక్తి, వ్యక్తి, ఒక నమ్మకం అని, చంద్రబాబును నమ్మి రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారు అని స్పష్టం చేశారు. అమరావతిని ముందుకు తీసుకెళ్తామని జగన్ పాదయాత్రలో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మూడుముక్కలాటతో చిచ్చు పెట్టారు అని విమర్శించారు.

‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో రాజధాని ప్రాంత మహిళలు, రైతులు 29వేల మంది యాత్ర చేపడితే జగన్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించిందని తెలిపారు. రి కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయి అని, జగన్‌ అణిచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంలా మారి దేశాన్ని ఆకర్షించింది అని గుర్తు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా? అన్న అనుమానానికి ఈ చట్టసవరణ ముగింపు పలుకుతుందని తెలిపారు. అమరావతి నిర్మాణం చంద్రబాబు ఆశయం అని, కూటమి ఐక్యతకు కంకణబద్ధుడైన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అని, వారితో పాటు రాజధానికి చట్టబద్ధత ఇచ్చేందుకు అంగీకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ మేం అమరావతికి వ్యతిరేకం కాదంటునే..ఈ తరహా బిల్లుకు వ్యతిరేమని ప్రకటించి వాకౌట్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Modi Assam Visit : తేయాకు తోటల్లో ప్రధాని మోదీ.. అస్సాం ఎన్నికల ప్రచార చిత్రం!
Auto Drivers Protest In Hyderabad | ఎల్పీజీ కొరతపై భగ్గుమన్న ఆటో కార్మికులు