ఏపి డిజిపి రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై వేటు

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్ర‌నాథ్ రెడ్డి (1992) పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేటు వేసింది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార వైసిపి ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తున్నారంటూ ప‌లు ఫిర్యాదులు వెళ్ల‌డంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ది

ఏపి డిజిపి రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై వేటు

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు
ఎన్నిక‌ల విధులు అప్ప‌గించ‌వ‌ద్దు

విధాత‌, విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్ర‌నాథ్ రెడ్డి (1992) పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేటు వేసింది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార వైసిపి ప్ర‌భుత్వానికి అనుకూలంగా ప‌నిచేస్తున్నారంటూ ప‌లు ఫిర్యాదులు వెళ్ల‌డంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి ఆదేశాలు జారీ చేసింది. వెంట‌నే రాజేంద్ర‌నాథ్ రెడ్డి త‌న బాధ్య‌త‌ల‌ను కిందిస్థాయి అధికారికి అప్ప‌గించాల‌ని, ఆయ‌న‌కు ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌చెప్ప‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈనెల 6వ తేదీ ఉద‌యం 11 గంట‌ల లోపు డిజి ర్యాంకు అధికారుల పేర్లు మూడింటిని పంపించాల‌ని సంఘం సూచించింది.

రాజేంద్ర‌నాథ్ రెడ్డి తో పాటు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డిపై ఇప్ప‌టికే తెలుగుదేశంతో పాటు ఇత‌ర పార్టీలు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు చేశాయి. అధికార వైసిపి ప్ర‌భుత్వం చెప్పిన విధంగా న‌డుచుకుంటూ త‌మ పార్టీ నాయ‌కుల‌ను వేధిస్తున్నార‌ని తెలిపారు. అంత‌కు ముందు జిల్లా క‌లెక్ట‌ర్లు, జిల్లా ఎస్పిల‌పై కూడా ఫిర్యాదు చేయ‌గా రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ప‌లువురు జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ వేసింది.

ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజుల వ్య‌వ‌ధి ఉంద‌న‌గా డిజిపిని బ‌దిలీ వేటు వేయ‌డం పోలీసు శాఖ‌లో సంచ‌ల‌నంగా మారింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ చంద్ర పునేతా పై వైసిపి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిపై బ‌దిలీ వేటు వేసిన విష‌యం విధిత‌మే. పునేతా స్థానంలో ఎల్వీ.సుబ్ర‌హ్మ‌ణ్యంను ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యారు.