ప్రాంతీయ విద్వేష వేదికగా చంద్రబాబు అమరావతి : మాజీ మంత్రి ధర్మాన ఫైర్
అమరావతి పేరుతో ప్రాంతీయ విద్వేషాలు పెంచుతున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
విధాత, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి రాజధానిపై పట్టుబడుతూ.. ప్రాంతీయ విద్వేషాలను రగిలించేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. నిధుల పంపిణీలో అసమానతల వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుంచుకోవాలని, హైదరాబాద్‌పై పెట్టిన దృష్టి ఇతర ప్రాంతాలపై పెట్టకపోవడం వల్లే విభజన జరిగిందని, మళ్లీ అదే తప్పు చేస్తూ ఉత్తరాంధ్రా, రాయలసీమలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ధర్మాన విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యం అని, తొలి ప్రధాని నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వారు.. అందరినీ సమానంగా చూడాలని, కానీ నేడు సీఎం చంద్రబాబు కేవలం ఒక ప్రాంతానికే, కొద్దిమంది సంపన్నులకే కొమ్ముకాస్తున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ హెచ్చరికలను చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని,
విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం నియమించిన నిపుణుల కమిటీని చంద్రబాబు గౌరవించలేదు అని ఆరోపించారు. అమరావతి రాజధానికి అనుకూలం కాదని నిపుణులు చెబితే వారిని అవమానించి పంపారు అని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ చట్టాన్ని సవరించారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ అవసరాల కోసం ఈ సవరణ చేయించారు అని విమర్శించారు. అమరావతి బిల్లు సమయంలో ప్రధాని మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలు సభకు రాలేదు అని గుర్తు చేశారు.
వెనుకబడిన ఉత్తరాంధ్రా, రాయలసీమలకు మరింత నష్టం
రాష్ట్ర రాజధాని ఫలానా చోటే ఉండాలని చెప్పే అధికారం కేంద్రానికి లేదని గతంలో అఫిడివిట్ ఇచ్చారు అని, రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సీటు ఏర్పాటు గురించి ఉందే తప్ప రాజధాని గురించి ఎక్కడా లేదు అని ధర్మాన వెల్లడించారు. ఉత్తరాంధ్రా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్రా ప్రజలు పొట్టచేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. రాయలసీమ బిడ్డగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు? అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం ఒక్క ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదు అన్నారు. 60 ఏళ్లవుతున్నా ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదు? అని ప్రశ్నించారు. విశాలమైన తీరప్రాంతం ఉన్నా ఒక్క హార్బర్ రాకుండా అడ్డుకోవడం ధర్మమేనా? అన్నారు.
ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ ప్రత్యేక డిమాండ్లు
రాష్ట్ర బడ్జెట్ రూ. 3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ. 1000 కోట్లు కూడా ఇవ్వరా? అని ధర్మాన ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో అమరావతిని కట్టాలంటే మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలని, అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారని, అంతకాలం ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండాలా? అని ధర్మాన నిలదీశారు. ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయి అన్నారు. భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సంపద ఐదు కోట్ల ప్రజలకు చెందాలి కానీ ఒక్క అమరావతికే కాదు అన్నారు. విశాఖ, విజయనగరంలో వస్తున్న సంస్థల ఆస్తులు ఇతర ప్రాంతాల వ్యక్తులకే చెందుతున్నాయని, అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు గోచీ తప్ప ఏమీ మిగలదు అని మండిపడ్డారు.
అమరావతి కోసం వెనుబడిన జిల్లాల వాణి అణిచివేత
ముఖ్యమంత్రి పంతం కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను మరుగున పడేయడం అన్యాయం అని, వలసలు ఆగేలా, స్థానిక ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు ఎందుకు కేటాయించడం లేదు? అని ధర్మాన ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కాకుండా సమాన అభివృద్ధికి సీఎం బాటలు వేయాలని కోరారు. అమరావతి పేరుతో వెనుకబడిన జిల్లాల నోళ్లు నొక్కడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Royal Enfield Hunter 350 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో నయా వేరియంట్.. అలాయ్ వీల్స్.. ట్యూబ్‌లెస్ టైర్లతో లాంచ్!
సర్కారీ వారి నెంబర్ ఎప్పుడూ బిజీనే..జర్నలిస్టుల పరేషాన్ !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram