విధాత: 2020, 2021 పదో తరగతి ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన చేయాలని ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కమిటీ సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019-2020 ఏడాదికి పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన విద్యార్థులందరికీ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంతర్గతంగా 50 మార్కులు చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్ గ్రేడ్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటికి ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.