Ys Sharmila : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..షర్మిల ఫైర్
ఏపీలో రూ.2500 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. షర్మిల ఆగ్రహం– పేదలకు వైద్యం అందించాలంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్.

అమరావతి : తెలంగాణలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయించాయి. తాజాగా ఇదే సమస్యతో ఏపీలో కూడా ఆరోగ్యశ్రీ ఓపీ సేవలు నిలిపివేయాలని ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఏపీ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే మూడుసార్లు సమ్మెకు పోయినా..బకాయిల పెండింగ్ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసోసియేషన్ గుర్తు చేసింది. సమస్యను వారంలో పరిష్కరించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీ సర్కార్ తీరుపై వైఎస్.షర్మిల మండిపాటు
ఏపీ ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.2500 కోట్లను తక్షణం చెల్లించి పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించేలా వెంటనే సమ్మెను విరమింప చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేట్ కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. పథకాన్ని ప్రైవేట్ బీమాతో ముడిపెట్టడం అంటే ప్రజారోగ్యానికి ఎసరు పెట్టడమేనన్నారు. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారు. ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెడుతున్నారని విమర్శించారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్ల కేటాయింపుకి మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి ? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దాని కన్నా.. బీమా కంపెనీలు ఇచ్చేది తక్కువనా ? రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి.. ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి ? దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయని గుర్తు చేశారు. ప్రైవేట్ బీమా భారం తప్పా లాభం కాదని ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని వెల్లడించారు. ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే రాష్ట్రంలో ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.