High Court
హైదరాబాద్, విధాత: మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం తెలంగాణ హైకోర్టులో ఆయన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపే జగన్ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు.
అంతేకాకుండా సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరిన నేపథ్యంలో ఆయన తీరుపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్రంగా మందలించింది. వ్యక్తిగత కేసుల వ్యవహారంలో పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు.
రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ ఎన్.తుకారాం నేతృత్వంలో కూడిన ధర్మాసనం విచారణ వేగంగా జరిగేలా పీపీని ఆదేశించేలా సీబీఐ డైరెక్టర్‌ను కోరారా? అని ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్‌ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారు? అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
రెండు వారాల గడువిస్తే పిల్ విచారణార్హతపై వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణను జులై 6కి వాయిదా వేస్తున్నట్టు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.