మచిలీపట్నం:ప్రజలకు ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చిన వెంటనే గుర్తుకు వచ్చేది పోలీస్. అలాంటి అపార నమ్మకం కలిగిన పోలీసింగ్ ను ప్రజలకు చేరువ చేయాలంటే వారితో మర్యాదపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ వారికి మేమున్నామని ధైర్యాన్ని వారిలో నింపినప్పుడే అది సాధ్యం. దానికి ప్రతి ఒక్క సిబ్బంది నిబద్ధత కలిగి విధులు నిర్వర్తించవలసి వస్తుంది. అలా కాకుండా పోలీసు ప్రతిష్టను భ్రష్టు పట్టించేలా సిబ్బంది వ్యవహరిస్తే క్రమశిక్షణారాహిత్య చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు.
అలాంటి అసభ్యకర ప్రవర్తన కలిగిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ విధిస్తూ ,ఈరోజు జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు
గంపలగూడెం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న PC-750 CH.V రామకృష్ణ sand చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొంత కాలంగా అధికారుల అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. విధుల పట్ల అలసత్వం వహించడమే కాక, ఆ ప్రాంత మహిళ వి.ఆర్.ఓ పట్ల, ఆమె తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందిపాలు చేస్తున్నాడని ఎస్పీ దృష్టికి రాగా,క్షణ మాత్రం ఆలస్యం చేయకుండా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది ఇవేకాక అతనిపై గతంలో కూడా పలు ఆరోపణలు రాబడినాయి.ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంఘటనపై అధికారులు పూర్తి విచారణ జరిపి విచారణకు సంబంధించిన నివేదికను ఎస్పి కి పంపగా, అతని పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ చేసుకుని ఈ రోజు అతని పై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సిబ్బంది ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే కాక, ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించిన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అవి నిజమని నిర్ధారణ అయితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.