Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జల దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రాజెక్టు లో కృష్ణమ్మ ఉప్పొంగడం తో నీటి పారుదల శాఖ అధికారులు మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

– మూడు గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటి విడుదల
– మూడు గేట్ల ద్వారా 81 వేల క్యూ సెక్కుల నీరు సాగర్ వైపు పరుగులు
– విద్యుత్ ఉత్పత్తి కోసం 63 వేల క్యూ సెక్కుల నీటి వాడకం
– 4.67 లక్షల క్యూ సెక్కుల ఇన్ ఫ్లో….. 1.41 లక్షలు అవుట్ ఫ్లో
– గేట్ల ను పది అడుగుల ఎత్తు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న డ్యామ్ అధికారులు
– ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు లో 180 టీఎంసీ ల నీటి నిలువ
– రెండు తెలుగు రాష్ట్రాలకు తొలగిన నీటి ఇబ్బంది
– ఉప్పొంగిన కృష్ణమ్మ తో ఆయకట్టు రైతాంగం లో వెల్లివిరిసిన ఆనందం

విధాత, ఉమ్మడి ,మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జల దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రాజెక్టు లో కృష్ణమ్మ ఉప్పొంగడం తో నీటి పారుదల శాఖ అధికారులు మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం వరద ఉధృతి పెరగడం తో గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు నీటిని వదిలారు. ముందుగా అనుకున్న ప్రకారం ప్రాజెక్టు గేట్లు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు వస్తారని అధికారులు ప్రకటించారు. కానీ ప్రాజెక్టు లో వరద పెరగడం తో ముందస్తు చర్యలు తీసుకుని ఒక రోజు ముందుగానే గేట్లు ఓపెన్ చేశారు.ప్రస్తుతం ప్రాజెక్టు లో 180 టీఎంసీ ల నీటిని నిలువ ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరద ను గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సమర్థ్యం 215 టీఎంసీ లు ఉండగా ఎగువ నుంచి భారీ గా వరద రావడంతో 180 టీఎంసీ ల నీటిని మాత్రమే ప్రాజెక్టు లో ఉంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.90 అడుగుల నీరు నిలువ ఉంది. ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 3.26 లక్షల క్యూ సెక్కులు, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల క్యూ సెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టు కు వచ్చి చేరుతోంది. వరద భారీగా పెరగడం తో ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూ సెక్కుల నీటిని దివగుకు విడుదల చేస్తున్నారు. మొత్తం మూడు గేట్ల ద్వారా 81 వేల క్యూ సెక్కుల నీరు సాగర్ వైపు పరుగులు పెడుతోంది. ఇదే కాక కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం 63 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల అవుతోంది. మొత్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు 1.44 లక్షల క్యూ సెక్కుల నీరు విడుదలవుతోంది. ఇలాగే భారీ వరద కృష్ణా నది కి వస్తే వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు 6,7,8 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు కు భారీ వరద రావడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులు తొలిగి పోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో రాయలసీమ కు నీరందించే పోతిరెడ్డి పాడు కు నీరు పుష్కళంగా అందుతుంది. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతాలకు నీరు అందుతుంది. ఎడమ కాలువ ద్వారా తెలంగాణ లోని నల్లగొండ జిల్లా కు నీరు సరఫరా అవుతోంది.

కుడి ప్రధాన కాలువ ద్వారా కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తారు.పోతిరెడ్డి పాడు నీటి ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండడం తో రెండు రాష్ట్రాల ఆయకట్టు రైతాంగం ఆనందంలో ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేడం తో ప్రాజెక్టు వద్ద సందర్శకులు సందడి చేస్తున్నారు.