కరువు నేల అనంతపురంలో ఎగిసిన పాతాళ గంగమ్మ !

కరువు నేల అనంతపురంలో బోరు వేయగా 470 అడుగులకే నీరు 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడింది. ఈ అరుదైన దృశ్యం రైతుల్లో కొత్త ఆశలు నింపింది.

కరువు నేల అనంతపురంలో ఎగిసిన పాతాళ గంగమ్మ !

అమరావతి : దేశంలోని అత్యంత కరువు ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడిన ఏపీలోని రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో పాతాళ గంగమ్మ ఎగిసిపడిన దృశ్యం వైరల్ గా మారింది. భూగర్బాన్ని చీల్చుకుని పాతాళ గంగమ్మ ధరణిపై చిందులేసిన ఆశ్చర్య దృశ్యాన్ని చూసి స్థానికులు అనందంతో కేరింతలు కొట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరుదైన జలసిరి ఆశ్చర్యకర దృశ్యం నెట్టింటా వైరల్ గా మారింది.

శ్రీ సత్యసాయి జిల్లా కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప పొలంలో బోరు వేయగా కేవలం 470 అడుగులకే నీరు ఉబికి పైకి ఎగచిమ్మింది. బోరు నుంచి భూగర్భజలాలు 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడడంతో.. ఎండిన నేలల్లో ఈ దృశ్యం స్థానిక రైతుల్లో కొత్త ఆశలను నింపింది.

తెలుగు గంగ, హంద్రీ-నీవాసుజల స్రవంతి, నగరి-గాలేరు సుజల స్రవంతి ప్రాజెక్టులతో పాటు వాటి లింకేజ్ ప్రాజెక్టులతో కృష్ణమ్మ పరవళ్లు కరువు సీమ రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరులకు క్రమంగా చేరుతుండటంతో జలవసతి విస్తరిస్తుంది. హెచ్చెల్సీ, హంద్రీనీవా పరిధిలోని నదులు, చెరువులు, కుంటలు, జలాశయాలు, కాలువలు నీరు చేరడంతో భూగర్భ జల మట్టం పెరుగుదలకు దోహదం చేసింది. దాదాపుగా 108టీఎంసీల నది జలాలు సీమ జిల్లాలకు చేరినట్లుగా అంచనా. జూన్‌ నుంచి అక్టోబర్ ఆఖరు దాకా అనంతపురంలో సాధారణ వర్షపాతం నమోదైంది. అనంత జిల్లాలో 423.4 మి.మీ. కురవాల్సి ఉండగా.. 442.2 మి.మీ నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలో 478.4 మి.మీ.లకు గాను 483.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా నది జలాలు, సాధారణ వర్షపాతం నేపథ్యంలో ఈ దఫా అనంతపురంలో భూగర్బ జల మట్టం పెరిగినట్లుగా భావిస్తున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా 14 రకాల జలాశయాలు ఉన్నాయి. బైరవానితిప్ప, యోగివేమన, పేరూరు, పీఏబీఆర్, ఎమ్పీఆర్, కణేకల్లు, చాగల్లు, పెండేకల్లు, సుబ్బరాయసాగర్, ముచ్చుకోటతోపాటు హంద్రీనీవా ప్రధాన కాలువ కింద జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి ఉన్నాయి. నందికొట్కూరు మండలంలోని మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని ఎత్తిపోసి, కాలువల ద్వారా వాటికి నీటిని తరలిస్తున్నారు. పీఏబీఆర్, చాగల్లు, బీటీపీ, యోగివేమన ప్రాజెక్టు పరిధిలో, చిత్రావతి పరిధిలో నీటి విడుదల కొనసాగడం భూగర్భ జలాల వృద్దికి దోహదం చేసినట్లయ్యింది. పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువ పరిధిలో పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మిస్తే మరింతగా జల వనరులు విస్తరిస్తాయని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Road Accident | త‌మిళ‌నాడులో ఘోర ప్ర‌మాదం.. 9 మంది దుర్మ‌ర‌ణం