మళ్లీ కేబినెట్లోకి కొడాలి నాని..?
ఉన్నమాట: ఎన్ని అనుకున్నా.. ఎలా వెక్కిరించినా గానీ ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కొడాలి నాని, పేర్ని నాని లేని లోటు కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశాన్ని, జనసేనను ఇద్దర్నీ ఒకేసారి ఎదుర్కొనేందుకు ఈ ఇద్దరు నానీలూ బాగా ఉపయోగపడే వాళ్ళు. ప్రభుత్వం మీద ఈగ వాలకుండా చూసుకునే విషయంలో వీరు ముందంజలో ఉండేవారు. కొడాలి మాట్లాడే తీరు ఇబ్బందికరమే అయినా ఆయన చంద్రబాబును .. లోకేశ్‌ను ఎదుర్కొనే విషయంలో ఈయన్ను మించిన వారు లేరు. అయితే ఆర్నెల్ల […]

ఉన్నమాట: ఎన్ని అనుకున్నా.. ఎలా వెక్కిరించినా గానీ ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కొడాలి నాని, పేర్ని నాని లేని లోటు కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశాన్ని, జనసేనను ఇద్దర్నీ ఒకేసారి ఎదుర్కొనేందుకు ఈ ఇద్దరు నానీలూ బాగా ఉపయోగపడే వాళ్ళు. ప్రభుత్వం మీద ఈగ వాలకుండా చూసుకునే విషయంలో వీరు ముందంజలో ఉండేవారు.
కొడాలి మాట్లాడే తీరు ఇబ్బందికరమే అయినా ఆయన చంద్రబాబును .. లోకేశ్‌ను ఎదుర్కొనే విషయంలో ఈయన్ను మించిన వారు లేరు. అయితే ఆర్నెల్ల కిందట జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లో ఈ ఇద్దరు నానీలనూ జగన్ పక్కనబెట్టారు. జగన్ కోసం తాము ఎంత చేసినా ఎంత ఎగిరెగిరి దంచినా తమకు పెద్దగా లాభించింది లేదని భావించిన కొడాలి..పేర్ని ఇద్దరూ సైలెంట్ అయ్యారు.
అదే తరుణంలో ప్రభుత్వం మీద టీడీపీ విమర్శల దాడి ముమ్మరమైంది. అయినా సరే వైసీపీ నుంచి ప్రతిస్పందన కరువైంది. ప్రభుత్వం మీద టీడీపీ చేసే ఎదురు దాడిని విమర్శలను తిప్పికొట్టేవాళ్ళు కరువయ్యారు. ఆఖరుకు ఢిల్లీలో మద్యం స్కామ్‌లో జగన్ భార్య భారతి రెడ్డి పాత్ర ఉందని, వేల కోట్లు కుంభకోణంలో భారతి రెడ్డికి భారీగా లబ్ది చేకూరిందని, ఆమెను కూడా విచారించాలని డిమాండ్లు వచ్చాయ్.
అయినా సరే ప్రభుత్వం నుంచి, వైఎస్సార్సీపీ నుంచి ఎదురుదాడి కనిపించలేదు. టీడీపీ చేస్తున్న విమర్శల దాడిని తట్టుకోలేక జగన్ సైతం మొన్నటి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను, తన భార్యను నేరుగా తిడుతున్నా మీరు ఎటాక్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అయినా ఎవరూ కిక్కురుమనలేకపోయారు. మేం ఎంత చేసినా మీ దగ్గర గుర్తింపు ఉండదు కదా.. ఎలాగూ గౌరవం.. ప్రాధాన్యం ఉండదు కదాని నేరుగా అనలేక మంత్రులంతా సైలెంట్ గా ఉండిపోయారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి..పేర్ని గానీ మంత్రులుగా ఉంటే ఇలాగే ఉండేదా.. చీల్చి చెండాడే వాడు కదా అన్న అభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో ముగ్గురు మంత్రులను తొలగించే అవకాశం ఉందన్న తరుణంలో మళ్ళీ కొడాలి నానిని కేబినెట్లోకి తీసుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొడాలి కానీ కేబినెట్లో ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుందని.. ఆయన మాత్రమే టీడీపీని గట్టిగా ఎదుర్కొన గలరని పార్టీలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతోబాటు మొత్తం కేబినెట్లో కమ్మ వర్గం నుంచి ఒక్కరూ లేకపోవడం చర్చకు వచ్చింది. దీంతో మళ్ళీ కొడాలికి కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. మొత్తానికి జగన్ మనసులో ఏముందో కొద్దీ రోజుల్లో క్లారిటీ రానుంది.