ప్రధాన ప్రతిపక్షం గుర్తింపుపై చట్టంలో ఉన్నది ఇదీ.. స్పీకర్‌కు రాసిన లేఖలో : వైఎస్‌ జగన్‌

అసెంబ్లీలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు తనకు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రధాన ప్రతిపక్షం గుర్తింపుపై చట్టంలో ఉన్నది ఇదీ.. స్పీకర్‌కు రాసిన లేఖలో : వైఎస్‌ జగన్‌

అమరావతి: అసెంబ్లీలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు తనకు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకాని ఈ నిబంధన పాటించలేదన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. అధికారకూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ‘చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది’ అని జగన్‌ తన లేఖలో తెలిపారు. ‘అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ్వీకారం చేయాలి, కాని అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

విపక్షంలో ఉన్నపార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెప్తోందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కానీ, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలోకానీ మీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైయస్సార్సీపీ 40శాతం ఓట్లను సాధించిందని, ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడిచేస్తున్నట్టే అవుతుందన్నారు. వైయస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుందని, దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కాని, వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదని అన్నారు. అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోందన్న జగన్‌.. ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఫలానా సంఖ్యలో సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈలేఖ మీకు రాస్తున్నానని, అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ‘నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణమీదే ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.