YS Avinash Reddy : ఎన్ బ్రాండ్ లిక్కర్ తో రూ.5280కోట్ల స్కామ్
నారా వారి 'ఎన్ బ్రాండ్' సారాతో కూటమి ప్రభుత్వం రూ.5280 కోట్ల స్కామ్ చేసిందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అమరావతి : ఏపీలో నారా వారి ఎన్ బ్రాండ్ సారాను నకిలీ లిక్కర్ గా అమ్మడం ద్వారా రూ. 5280కోట్ల స్కామ్ చేశారని వైసీపీ కడప ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో నూతన లిక్కర్ పాలసీ వచ్చాకా రూ.111కోట్ల క్వార్టర్ బాటిల్స్ సేల్ జరిగితే..అందులో 48 కోట్ల కేసుల క్వార్టర్ బాటిల్స్ అమ్మడం ద్వారా రూ. 5280కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. కల్తీ మద్యాన్ని అమ్మడం ద్వారా ప్రజల ఆరోగ్యం..ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని అవినాష్ రెడ్డి విమర్శించారు.
నారా వారి ఎన్ బ్రాండ్ సారాను అమ్మడం అంటే ప్రజల బలహీనత సొమ్ము చేసుకొని దెబ్బకొట్టారని ఆరోపించారు.. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ తప్పు కప్పిపుచ్చుకోలేనిదని, దీనికి భవిష్యత్తులో భారీ మూల్యం చల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నకిలీ మద్యంతో సంబంధం లేదని తయారీదారుడు విడుదల చేసిన వీడియో చూస్తే ఇంకా అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. నిందితులను తప్పించడానికి అగ్ర నాయకత్వం కృషి చేస్తుందని అవినాష్ రెడ్డి ఆరోపించారు.
అఫ్రికా మద్యం అమ్ముతున్నారు : పేర్ని నాని
టీడీపీ ప్రభుత్వం ఆఫ్రికా నుండి కొత్త ఫార్ములా తెచ్చి కొత్త మద్యం అమ్ముతున్నారని… సూపర్ సిక్స్ బ్రాండ్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మందు అంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మెక్ డోనాల్డ్, బ్యాక్ పైపర్, మాన్షన్ హౌస్ లేదన్నారు. మరి ఇప్పుడు దొరికే మందు పేరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు బ్రాండేనా? అని ఎద్దేవా చేశారు. రాయలసీమలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 1, ఉత్తరాంధ్రలో కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఉన్నాయని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీ శిక్షణ ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారని విమర్శించారు.
కల్తీ మద్యం దర్యాప్తు ముమ్మరం
ఏపీ కల్తీ మద్యం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2012 నుంచి ఏఎన్నార్ బార్ నడుపుతున్న ఏ-1 అద్దెపల్లి జనార్ధన్ 20-36 మద్యం దుకాణాల్లో భాగస్వామిగా ఉన్నారని గుర్తించారు. విజయవాడ భవానీపురంలో శ్రీను వైన్స్, కంచికర్లలో మరో వైన్స్‌లో జనార్ధన్‌కు వాటాలున్నాయని.. లిక్కర్ సిండికేట్‌లో ఉన్న పరిచయాలతో కల్తీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. జనార్ధన్ భాగస్వామిగా ఉన్న వైన్స్, బార్స్ యజమానులను విచారించాలని నిర్ణయించారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్‌రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఏ11 శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేసి భవానీపురం ఎక్సైజ్ ఆఫీసుకు తరలించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు చేపట్టారు. నిందితుల ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ దిద్దుబాటు
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ యాక్షన్ చేపట్టారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం దొరుకడం..ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, సన్నిహితుడు జనార్దన్‌రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు.. పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనకున్న నలుగురు కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు.