చైనా మాంజా త‌గిలి 12 ఏండ్ల బాలుడు మృతి

చైనా మాంజాను నిషేధించినా దానిని గాలిపటాలు ఎగరేసేందుకు వాడుతుండటం ప్రాణాలమీదకు తెస్తున్నది.

చైనా మాంజా త‌గిలి 12 ఏండ్ల బాలుడు మృతి
  • రాజ‌స్థాన్‌లో వేర్వేరుగా ఐదుగురికి గాయాలు
  • ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో, ఢిల్లీలో ఇద్ద‌రు మృతి

విధాత‌: చైనా మాంజా మ‌రొక‌రిని బ‌లి తీసుకున్న‌ది. గాజు పూతతో కూడిన చైనా మాంజాను ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా నిషేధించింది. కానీ, కొంద‌రు వ్యాపారులు అక్ర‌మంగా విక్ర‌యిస్తున్నారు. అనేక మంది వాటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అవి మెడ‌కు త‌గిలి ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రాజాస్థాన్‌లో 12 ఏండ్ల బాలుడు చ‌నిపోయాడు. కోటా జిల్లాలో వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు గాయ‌ప‌డ్డారు.


5వ తరగతి చదువుతున్న సురేంద్ర భీల్ అనే విద్యార్థి సోమవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఇంటి పైకప్పుపై గాలిపటాలు ఎగురవేన్నాడు. ఆ సమ‌యంలో చైనా మాంజా బాలుడి గొంతుకు త‌గిలి కోసుకుపోవడంతో తీవ్ర ర‌క్త‌స్రావమై అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. అతడిని వెంటనే ద‌వాఖాన‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపిన‌ట్టు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ భన్వర్ సింగ్ తెలిపారు వెల్ల‌డించారు.


మకర సంక్రాంతి సందర్భంగా నిషేధిత చైనా మంజా త‌గిలి 60 ఏండ్ల‌ వృద్ధుడితో సహా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాంలాల్ మీనా అనే వ్యక్తి మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా సాతుర్ గ్రామంలో మాంజా మెడపై కోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మీనాకు 13 కుట్లు పడ్డాయని, కోటాలోని ద‌వాఖాన‌లో చేర్పించిన‌ట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కోటా నగరంలో పదునైన గాలిపటాల మాంజాల కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో పక్షులు చనిపోయాయని, 34 మంది గాయపడ్డాయని పక్షులకు చికిత్స అందించడంలో సహాయపడే ఓ సంస్థ అధ్యక్షుడు తెలిపారు.


ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో బైక్‌పై వెళ్తున్న ఆర్మీ జ‌వాన్‌కు చైనా మాంజా త‌గిలి గొంతు తెగి చ‌నిపోయారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏడేండ్ల బాలిక కూడా చైనా మాంజా త‌గిలి ప్రాణాలు కోల్పోయింది.