బీఎస్ఎఫ్ స్థావరాలపై పాక్ కాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

అంతర్జాతీయ సరిహద్దులోని అర్నియా, సుచేత్‌ఘర్ సెక్టార్‌లలో ఉన్న బీఎస్ఎఫ్ స్థావరాలపై పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఒక పౌరుడు గాయపడ్డారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లోని అర్నియా సెక్టార్‌లో గురువారం రాత్రి 8 గంటలకు పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు పాక్ కాల్పులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు. పాక్ వైపు ఎలాంటి నష్టం జరిగిందో తెలియరాలేదు అని చెప్పారు. నాలుగైదు స్థావరాలపై పాక్ కాల్పులు జరిపిందని తెలిపారు.
సరిహద్దు గుండా ఉంటున్న పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు మోర్టార్ షెల్స్‌తో దాడులకు పాల్పడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని తెలిపారు. అర్నియా, సుచేత్‌ఘర్, సియా, జబోవాల్, ట్రేవా ఏరియాల్లో పాక్ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.