Maharashtra | మహారాష్ట్రలో ఘోరం.. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 24 మంది మృతి

Maharashtra | మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. 24 గంటల్లో 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నాందేడ్‌లోని శంకర్ రావు చవాన్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో 24 మంది రోగులు చేరగా, వీరంతా 24 గంటల్లోనే చనిపోయారు. 12 మంది పెద్దలు, 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో పాము కాట్లకు గురైన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కూడా చనిపోయినట్లు తెలిపారు. చనిపోయిన 12 మంది చిన్నారుల్లో ఆరుగురు అమ్మాయిలు ఉన్నట్లు స్పష్టం చేశారు.
సరిపడా సిబ్బంది, మెడిసిన్స్ లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. బదిలీలు జరిగిన తర్వాత కొత్త సిబ్బందిని నియమించలేదన్నారు. ఈ ఆస్పత్రిలో వైద్యసేవల కోసం 80 కిలోమీటర్ల నుంచి రోగులు వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రోగుల తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. మందుల కొనుగోలుకు బడ్జెట్ లేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు ట్రిపుల్ ఇంజిన్ సర్కారే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.