మతాంతర వివాహం చేసుకున్నారని..
మతాంతర వివాహం చేసుకున్న ఒక జంటపై కర్ణాటకలో దాడి జరిగింది.

- హోటల్ రూమ్‌లో చొరబడి.. జంటను చావబాదిన ఉన్మాదులు
- ఇద్దరు అరెస్టు.. మిగిలినవారికోసం వేట
బెంగళూరు: లాడ్జ్‌లో రూం తీసుకున్న ఓ మతాంతర జంటపై ఆరుగురు యువకులు దాడులకు తెగబడ్డారు. గదిలోపలకు వెళ్లి మరీ అమ్మాయిని, అబ్బాయిని చావబాదారు. కర్ణాటక (Karnataka) లోని హవేరీ జిల్లా హనగల్ తాలుకాలో ఈ ఘటన జరిగింది. ఇరు మతాలకు చెందిన వారు గదిలో కలిసి ఉండటం తప్పు అని అరుస్తూ.. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఆ జంటపై దాడి (Inter Faith Couple) కి పాల్పడ్డారు.
ఘటనను వారే వీడియో తీసి ఆన్‌లైన్‌లో వైరల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ముందుగా ఆరుగురు యువకులూ గది వద్దకు వచ్చి తలుపు తట్టారు. కాసేపటికి అబ్బాయి వచ్చి తలుపు తీయగానే దుండగులు నేరుగా అమ్మాయి వద్దకు వెళ్లారు. ఆమె బుర్ఖా వేసుకుని ఉన్న ఆ అమ్మాయిపై బూతులు తిడుతూ వారు పిడిగుద్దులు కురిపించారు. ఆ బాధకు తాళలేక ఆమె కింద పడిపోయింది. ఆమెతో వచ్చిన అబ్బాయిని కూడా ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టారు.
దీంతో అతడు రూం బయటకు సాయం అర్థించడానికి రావాలని ప్రయత్నించగా అడ్డుకుని మళ్లీ కొట్టారు. అనంతరం అమ్మాయిని మంచానికి ఆన్చి చెంపలపై తీవ్రంగా కొట్టారు. మరొకడు నేలపై పడేసి కాళ్లతో తన్నాడు. ఇక్కడితో ఒక వీడియో ముగిసిపోగా.. మరో వీడియోను లాడ్జ్ బయట తీశారు. అందులో ఆ అమ్మాయి బుర్ఖాను లాగేయడానికి నిందితులు ప్రయత్నిస్తుండగా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ బుర్ఖాను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ దారుణ ఘటనపై బాధిత జంట హనగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటన ఈ నెల 7న జరిగినట్లు గుర్తించామన్నారు. ఇందులో దాడికి పాల్పడిన వారందరూ మైనారిటీ వర్గానికి చెందిన వారేనని తెలిపారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాగా రెండు రోజుల క్రితమే.. వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయిని బెలగావిలో కొంతమంది దుండగులు కొట్టిన విషయం తెలిసిందే. ఇందులో కూడా నిందితులు మైనారిటీ వర్గానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. వారు తాము అన్నా చెల్లెలమని చెబుతున్నా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టారు.