ప్రమాణస్వీకారం సోమవారం లేదు.. పీసీసీ అధికారిక ప్రకటన

ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణం చేస్తారని

ప్రమాణస్వీకారం సోమవారం లేదు.. పీసీసీ అధికారిక ప్రకటన
  • ఎల్లా హోటల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బస
  • రేపు సీఎల్పీ సమావేశం.. అందులోనే ప్రకటన

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనే విషయంలో సస్పెన్స్‌ నెలకొన్నది. తొలుత అనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా సోమ‌వారం ప్ర‌మాణం చేయ‌నున్నారని వార్తలు వచ్చినా..  అలాంటిదేమీ లేదని, సీఎల్పీ సమావేశం మాత్రమే సోమవారం ఉదయం తొమ్మిదన్నరకు గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాలో నిర్వహిస్తున్నామని పీసీసీ అధికారికంగా తెలియజేసింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేసే అవకాశం ఉన్నదని, ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో పీసీసీ వివరణ ఇచ్చింది. సీఎల్పీ నేత ఎంపిక కోసం ఏఐసీసీ నుంచి ఐదుగురు ప‌రిశీల‌కులు వ‌చ్చారు. వీరి స‌మ‌క్షంలో సీఎల్పీ నేత ఎంపిక కార్య‌క్ర‌మం జ‌రుగ‌నున్న‌ది. గెలిచిన ఎమ్మెల్యేలంతా గ‌చ్చిబౌలిలోని ఎల్లా హోట‌ల్‌కు చేరుకుంటున్నారు.


అన్నీ తానై తిరిగిన రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌రువాత పార్టీకి నూత‌న జ‌వ‌స‌త్వాలు తీసుకు వ‌చ్చారు. కాగా అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో సీనియ‌ర్లుగా చెప్పుకొనే నేత‌లంతా నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం కాగా, రేవంత్ రెడ్డి తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాలతోపాటు రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించారు. సీఎల్‌పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాతో పాటు ఇత‌ర ప్రాంతాలు ఒక‌టి రెండు చోట్ల ప్ర‌చారం చేశారు. కానీ రేవంత్ బాధ్య‌త తీసుకొని రాష్ట్ర‌మంతా ప్ర‌చారం చేసి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. దీంతో అధిష్ఠానం రేవంత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తున్నది. 


గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు

ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి కోరుతూ కాంగ్రెస్ నేత‌లు ఆదివారం రాత్రి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను క‌లిశారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన వారిలో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డికే శివ‌కుమార్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ మాజీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి త‌దిత‌రులున్నారు. ఇదిలా ఉంటే.. సీఎల్పీ నాయకుడి ఎంపిక ఇంత వరకూ ఏఐసీసీ స్థాయిలో జరుగలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సీఎల్పీ నేత ఎవరనేది ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా? అన్న ప్రశ్నకు తన అభిప్రాయాన్ని బయట చెప్పబోనని తెలిపారు.