కొత్త అసెంబ్లీకి గెజిట్ విడుదల..
కొత్త శాసనసభ ఏర్పాటయింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సొందర్ రాజన్ గెజిట్ విడుదల చేశారు.

- తెలంగాణ రెండో అసెంబ్లీ రద్దు..
- సీఎం అభ్యర్థిపై తేల్చని కాంగ్రెస్
విధాత : తెలంగాణ కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ నేతృత్వంలోని బృందం కొత్త ఎమ్మెల్యేల జాబితాను అందచేసింది. దీంతో మంత్రివర్గ సిఫారసు మేరకు రెండో శాసన సభను రద్దు చేసి, తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు.
నూతన శాసన సభ గెజిట్ అనంతరం మెజార్టీ ఎమ్మెల్యేల నేతగా ఎన్నికైన వ్యక్తి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడమే మిగిలింది. అయితే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ తరుఫున సీఎల్పీ నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, హైకమాండ్ ఇంకా ఎవరిని ఎంపిక చేయకపోవడంతో సీఎం పదవీ ప్రమాణ స్వీకారోత్సవంపై సస్పెన్స్ కొనసాగుతున్నది. సోమవారం కొత్త సీఎం ఎవరన్నది తేలిపోతుందని రోజంతా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది.
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సీఎల్పీ సమావేశం ఏక వ్యాక్య తీర్మానం చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్నిసీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదరం రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. దీనిపై పార్టీ ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తున్నది. మంగళవారం డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఢిల్లీకి పిలిచిన హైకమాండ్ ఏఐసీసీ అధ్యక్షుడి ఖర్గేతో సమావేశం కావాలని ఆదేశించింది. ఈ భేటీ అనంతరం సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్ నుంచి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్
తెలంగాణలో ఎన్నికల కోడ్ సోమవారంతో ముగిసింది. అక్టోబర్ 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి డిసెంబర్ 3వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల సంఘం కొత్తగా ఏర్పడే అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేల ఎన్నికల ప్రక్రియ ముగించి, గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితాను సైతం అందించారు. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోగా కోడ్ అమలు కూడా ముగిసింది. గవర్నర్ పాత అసెంబ్లీ రద్ధు చేసి..కొత్త అసెంబ్లీకి గెజిట్ కూడా విడుదల చేసింది. ఇంతకాలం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆగిపోయిన పనులు, చెల్లింపులు ఇక మళ్లీ కొనసాగనున్నాయి.