జపాన్‌ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌

భూకంపాలతో అతలాకుతలమైన జపాన్‌ నుంచి తిరిగి వచ్చినట్టు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు.

  • Publish Date - January 2, 2024 / 10:43 AM IST

వరుస భూకంపాలతో అతలాకుతలమైన జపాన్‌ నుంచి తాను సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చానని జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలిపారు. లెక్కకు మిక్కిలి భూకంపాలతో జపాన్‌ సోమవారం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. ఈ భూకంపాల్లో 30 మందికిపైగా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. జపాన్‌లో గడిపేందుకు కొద్ది రోజుల క్రితమే జూనియర్‌ ఎన్టీఆర్‌ వెళ్లారు. అయితే.. మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు వచ్చానని ఎక్స్‌లో తెలిపారు. భూకంప ప్రభావితులకు తర్వగా సాంత్వన చేకూరాలని ఆయన ప్రార్థించారు.


భూకంపం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. గతవారం అంతా అక్కడే గడిపానని తెలిపారు. బాధితుల కోసం తన మనసు కొట్టుకులాడుతున్నదని చెప్పారు. వారికి వెంటన సాంత్వన కలగాలని కోరుకుంటునట్టు తెలిపారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా 2022లో జపాన్‌లో విడులై, అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. జపాన్‌లో సుమారు 24.13 కోట్ల రూపాయలు వసూలైనట్టు అంచనా. సోమవారం వరుస భూకంపాలతో జపాన్‌ కకావికలమైంది. గరిష్ఠంగా 7.6 తీవ్రతతోనూ భూకంపం వచ్చింది.