Komatireddy Rajagopal Reddy | కేసీఆర్‌ను గద్దె దించడమే నా ఏకైక లక్ష్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిన్న రాత్రి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. ఇవాళ మళ్లీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిసి మరోసారి కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని, అందుకే ఏఐసీసీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు. ఇక బీజేపీలోకి వెళ్లిన, కాంగ్రెస్‌లో చేరినా కేసీఆర్‌ను గద్దె దించడమే తన టార్గెట్ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనకు తాను వ్యతిరేకమన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెడుతానని చెప్పారు.
కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరాను. చర్యలు లేనందుకే బయటకు వచ్చాను అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీలో తనకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ తన లక్ష్యం నెరవేరలేదు. హాంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్టే. ప్రజలు తాను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరాను. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయి. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నారు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చాడని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.