మిజోరం సీఎంగా లాల్‌డుహోమా ప్రమాణం.. ఇదీ సీఎం నేపథ్యం..

మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా జెడ్పీఎం అధినేత లాల్‌డుహోమా ప్రమాణం చేశారు.

మిజోరం సీఎంగా లాల్‌డుహోమా ప్రమాణం.. ఇదీ సీఎం నేపథ్యం..

మరో 11 మంది మంత్రులుగా..

ఐజ్వాల్‌: జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్పీఎం) ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత లాల్‌డుహోమా శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 20 సీట్లు ఉన్న మిజోరం అసెంబ్లీలో జెడ్పీఎం 27 స్థానాల్లో విజయం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ఓటమిపాలైంది. ముఖ్యమంత్రిగా ఉన్న జోరంతంగా కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన లాల్‌డుహోమా తొలి కాంగ్రెసేతర, ఎంఎన్‌ఎఫ్‌ యేతర ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కంభంపాటి హరిబాబు కొత్త మంత్రివర్గంతో ప్రమాణం చేయించారు. లాల్‌డుహోమాతోపాటు సీ లాల్‌స్వివూంగా, కే సప్దాంగ, లాల్‌తాన్‌సంగా, పీసీ వన్‌లాల్‌రౌటా, డాక్టర్‌ వాన్‌లాల్‌త్లానా తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు.

లాల్‌డుహోమా ప్రస్థానం ఇదీ

లాల్‌డుహోమా గతంలో ఐపీఎస్‌ అధికారిగా పనిచేశారు. 1984లో తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 1988లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకు ముందు 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి భద్రత ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 1986లో మిజో శాంతి ఒప్పందంపై సంతకాలు, రాష్ట్రంలో తీవ్రవాద సమస్యల నిర్మూలనలో లాల్‌డుహోమా కీలక పాత్ర పోషించారు. 1997లో జోరం నేషనలిస్ట్‌ పార్టీని స్థాపించారు. అనంతరం బహుళ పార్టీల కూటమి అయిన జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌లో 2017లో చేరారు. 2019లో జెడ్పీఎంకు రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించింది.