లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోవడంతో పాటు, విద్వేషం కూడా పెరిగింది. దేశం అనేక రంగాల్లో దిగజారుతున్నది. దీంతో మోదీ ప్రభుత్వంపై అంతర్లీనంగా వ్యతిరేకత కనిపిస్తున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటినుంచి దృష్టి మళ్లించేందుకు ఇప్పటికే రామాలయం అంశాన్ని ప్రధానంగా ఈ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. జనవరి 22న అయోధ్య రామాలయంలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల వరకూ ప్రజలను ఆ మత్తులో ఉంచాలని బీజేపీ చూస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగదల కూడా సామాన్యులను పట్టిపీడిస్తున్న అంశం. ఎన్నికల సమయానికి ఇది కూడా ఒక అజెండాగా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల చెబుతున్నారు. దీనిపై కేంద్ర పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ధరల తగ్గింపుపై నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు మొదలవుతాయి. ఈలోపే ప్రజలను డైవర్ట్ చేసేందుకు పెట్రో ధరల తగ్గింపు నిర్ణయాన్ని వాడుకునే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు తగ్గాయి.
గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు కేంద్రం మన వద్ద మాత్రం ధరలు తగ్గించలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ కావడంతో ధరల తగ్గింపుపై ఆలోచిస్తున్నదని చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ప్రకటన చేయనున్నదని కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. తగ్గింపు కూడా రూపాయో రెండు రూపాయలో కాకుండా.. ఏకంగా లీటరుపై పది రూపాయల వరకూ ఉండొచ్చని సమాచారం. గతంలో రెండేళ్ల క్రితం కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని పెట్రోల్, డీజిల్‌పై రూ.8, రూ.6 మేరకు తగ్గించిన విషయం తెలిసిందే. పలు మెట్రో నగరాల్లో ఇప్పటికే లీటరు పెట్రోల్ నూటపది రూపాయలు దాటిపోయింది. గతంలో రేట్లు తగ్గించినప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి ఇదంతా ప్రధాని నరేంద్రమోదీ ఘనత అని ప్రకటించారు. ఉత్తర అమెరికా దేశాల్లో 70%-80% మేర రేట్లు పెరిగితే భారత్‌లో మాత్రం 5శాతం మేర ధరలు తగ్గించారని కొనియాడారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 70 నుంచి 80 డాలర్ల మధ్య కొనసాగుతున్నది. ఈ పరిస్థితిని అవకాశంగా చేసుకుని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ప్రధాన మంత్రి కార్యాలయానికి అందినట్టు ఒక వార్త సంస్థ పేర్కొన్నది.