విమానాన్ని దొంగిలించిన వ్య‌క్తి.. గాల్లోకి లేచిన కాసేప‌టికే..

అమెరికాలో ఓ వ్య‌క్తి ఏకంగా విమానాన్నే దొంగిలించాడు. అది మార్గ‌మ‌ధ్యంలో కుప్ప‌కూల‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.

విమానాన్ని దొంగిలించిన వ్య‌క్తి.. గాల్లోకి లేచిన కాసేప‌టికే..

అమెరికా (America) లో ఓ వ్య‌క్తి ఏకంగా విమానాన్నే దొంగిలించాడు (Plane Theft) . అది మార్గ‌మ‌ధ్యంలో కుప్ప‌కూల‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఆడిస‌న్ ఎయిర్‌పోర్టులో బుధ‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. కెసెనా 172 అనే ఆడిస‌న్ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్ల‌యిట్ స్కూల్ నుంచి దుండ‌గుడు దొంగిలించాడు. విచార‌ణ‌లో నిందితుణ్ని 23 ఏళ్ల లోగ‌న్ తిమోతీగా పోలీసులు గుర్తించారు. విమానం కొట్టేసిన త‌ర్వాత అత‌డు 120 కి.మీ. ప్ర‌యాణించాడు. అయితే టెక్సాస్ స‌రిహ‌ద్దుల వద్ద‌కు వ‌చ్చేట‌ప్ప‌టికి ఆ విమానం కూలిపోయింది. సాయంత్రం 6:53 గంట‌ల‌కు గాల్లోకి లేచిన విమానం.. 8:26 గంట‌ల‌కు కూలిపోయిన‌ట్లు ఏటీసీ నివేదిక‌లు చెబుతున్నాయి. విమానం కూలిపోయిన‌ప్పుడు అందులో తిమోతీ ఒక్క‌డే ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. విమానం కూలిపోతున్న‌పుడు అతడు స‌హాయం కోసం ఏటీసీని అర్థించాడ‌ని కొన్ని మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. అత‌డికి, ఏటీసీకి జ‌రిగిన‌ట్లు చెబుతున్న ఒక సంభాష‌ణ ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీ నియమాలు, స‌ల‌హాలు నేను పాటించాల‌నుకోవ‌ట్లేదు. ఈస్ట్ టెక్సాస్ వైపు దూసుకుపోతా అని నిందితుడు ఏటీసీ సిబ్బందితో చెబుతున్న‌ట్లు ఇందులో ఉంది. ఏటీసీతో అనుసంధానం కాకుండా ఉండేందుకు క‌మ్యునికేష‌న్ స‌ర్క్యూట్ బ్రేక‌ర్ల‌ను ఆఫ్ చేసిన‌ట్లు కూడా అందులో ఉంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి ద‌ర్యాప్తును నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డ్‌, ఫెడ‌ర‌ల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ సంస్థ‌లు చేప‌డుతున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. కాగా అమెరికాలోని ఎయిర్‌పోర్టుల నుంచి పైల‌ట్ స్కూళ్ల నుంచి విమానం దొంగ‌త‌నాలు జరుగుతూ ఉంటాయి.