కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి
– “ప్రజాస్వామిక తెలంగాణ” పునర్నిర్మాణానికై ఉద్యమిద్దాం
– తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పండి!
– UAPA కేసులను రద్దు చేయండి! NIA దాడులను ఆపండి!
– ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలి
– సీపీఐ (మావోయిస్టు)పై, అనుబంధ ప్రజాసంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండి
– “ప్రజా పాలన ”కార్యక్రమంలో-కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి
— సీపీఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి జగన్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి:
కెసిఆర్ కుటుంబం ప్రజలకందనంత ఎత్తుదిగి కన్ను మిన్ను గానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలని సీపీఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి జగన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల అక్రమ ఆర్జనపై విచారణ చేపట్టాలని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
– దొరతనాన్ని పునర్ నిర్మించిన కెసిఆర్
కాంగ్రెసు ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించింది. స్వేద పత్రమంటూ పదేళ్లు తెలంగాణ ను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్
ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాలి వాస్తవానికి తెలంగాణ లో అన్నపు రాసులు ఒక చోట – ఆకలి దప్పులు ఒక చోట కేంద్రీకృతమయ్యాయి. ఇక్కడి వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొర తనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కూలీల, పేదరైతుల, మధ్యతరగతి, ఉద్యోగ కార్మిక వర్గాలను కకావికలం చేసారు.
– కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతి
ఆర్థికం అంటూ అంకెల గారడీ చూపిన గత పాలకులు తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్లీ భూస్వామ్య పెత్తందారీ గడీల నిర్మాణానికి పునాదులు వేసారు. కాళేశ్వరం పేరిట దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా అంతటా ప్రజలను వంచించారు. ప్రభుత్వాలిచ్చే శ్వేత పత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదు. స్వేద పత్రాలు వాస్తవాలను వెల్లడించవు. అందువల్ల వాస్తవాలను ప్రజలకు తెలియ పరచండి.
– కెసిఆర్ కుటుంబానికి అన్ని ఆస్తులు ఎక్కడివి
కేసీఆర్ కు అన్ని ఆస్తు లెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సెంటీజీల వివరాలేంటి?
– అభివృద్ధి పేరిట అవినీతి రాజ్యం
సెక్రెటేరియేట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి
చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? ప్రజాకంటక నయీమ్ ముఠా ఎన్ కౌంటర్ అనంతరం జప్తు అయిన నాలుగయిదు వేల కోట్ల నగదు ఎవరికి చేరింది? ఇవన్నీ శ్వేత పత్రాల పరిధికి రావు గదా? ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజాకోర్టులో
పాలకులు శిక్షించగలరు? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్, కవిత మూడుకోట్ల రూపాయల చేతి
గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీము భండారం, పదకొండు వందల కోట్ల వ్యయంతో రూపొందిన వరంగల్ హాస్పిటల్
మూడున్నర వేల కోట్ల వ్యయం పెరిగినా నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి?
– కెసిఆర్ ఆస్తులపై శ్వేత పత్రం ప్రకటించాలి
శ్వేత పత్రాలు బయటపెట్టిన
పాలకులు కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా? ఎన్నెన్ని వేల కోట్లు? ఎంతెంత అవినీతి?
ప్రజలకందనంత ఎత్తుదిగి కన్ను మిన్ను గానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి.
– కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టాలి
ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ‘కాంగ్రెసు ప్రభుత్వం” ను విచారించాలని డిమాండ్ చేయండి. కేసీఆర్ కుటుంబం
అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటుచేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తామని పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ ను
“ప్రజాపాలన” లో అడగండి, నిలదీయండంటూ సీపీఐ (మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆ ప్రకటనలో విన్నవించారు.