విజయవాడ – హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్.. సంక్రాంతి ఎఫెక్ట్
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి వాహనాలతో విజయవాడ- హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ కనిపిస్తున్నది.

రహదారులపై సంక్రాంతి రద్ధీ
పంతంగి టోల్గేట్ వద్ధ వాహనాల బారులు
విధాత : సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి-నార్కట్పల్లి రహదారి, వరంగల్-హైద్రాబాద్, జాతీయ రహదారులు సహా పలు జిల్లాల రహదారులు వాహనదారుల బారులతో రద్ధీగా మారాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. విజయవాడ-హైద్రాబాద్ రహదారిపై పంతంగి వద్ద టోల్ ప్లాజా దాటేందుకు సుమారు అరగంటకు పైగా సమయం పడుతుంది. మొత్తం 18 టోల్ బూత్లు ఉండగా విజయవాడ మార్గంలోనే 11బూత్లు తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. హైవే వెంట చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తోపాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది.
హైద్రాబాద్ ఉప్పల్, ఎల్బీ నగర్ బస్ స్టాపుల వద్ద, మహాత్మగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో, జిల్లా కేంద్రాల్లో బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్ధీ విపరీతంగా కొనసాగుతోంది. వరంగల్ – హైదరాబాద్ రహదారి మార్గంలో గూడూరు టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. అన్నిచోట్ల రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాపిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. ఆర్టీసీ, రైల్వే అధికారులు అదనపు సర్వీస్లు నడిపిస్తున్నారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లే్ ప్రయాణికుల రద్ధీ ఒక్కసారిగా పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్ టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టోల్ ప్లాజాలో ప్రతిరోజూ దాదాపు 38,000 వాహనాలు తిరుగుతుంటాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంఖ్య 70,000 వరకు పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు రావడంతో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు తమ సొంత ఊళ్లలో ఉన్న తమ దగ్గరి, ఆత్మీయులను కలిసేందుకు ప్రజలు, విద్యార్థులు బారులు కట్టారు. స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. ఈ బస్సులు జనవరి 6 నుండి 15 వరకు, రాష్ట్రంలోని గమ్యస్థానాలకు మరియు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలను కవర్ చేస్తాయి. తెలంగాణలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మహాలక్ష్మి ఈ ఏడాది రద్దీని పెంచింది. రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేస్తామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ సదుపాయాన్ని పొందేందుకు మహిళలు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలని అధికారులు కోరారు.