జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు అంశంపై 11న సుప్రీంకోర్టు తీర్పు
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే ఉన్నదా? అన్న అంశంలో సుప్రీంకోర్టు 11న తీర్పు వెలువరించనున్నది.

16 రోజుల పాటు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: 370వ అధికరణం కింద జమ్ముకశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగపర చెల్లుబాటు అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును డిసెంబర్ 11న వెలవరించనున్నది. 370వ అధికరణం రద్దుపై గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. పదహారు రోజులుగా పలు పిటిషన్లపై విచారణ జరిపి, తీర్పును డిసెంబర్ 5న రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
2019 ఆగస్ట్ 5వ తేదీన సంచనల నిర్ణయం తీసుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దానితోపాటు.. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. దీనిని కశ్మీర్‌లోని ప్రధాన పార్టీలు సహా అనేక ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. పూర్తిస్థాయిలో సమీక్షించిన సుప్రీంకోర్టు.. దాదాపు 23 పిటిషన్లపై విచారణను ప్రారంభించింది. 16 రోజులపాటు సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని దాదాపు కోటిన్నర మంది ప్రజలపై ప్రభావం చూపున్న రీత్యా సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదేనా అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తేల్చనున్నది. అయితే ప్రభుత్వం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమాఖ్య స్వభావాన్ని ఉల్లంఘించలేదని చెబుతున్నది. ఆర్టికల్ 370 తొలగింపు, రాష్ట్ర అసెంబ్లీ రద్దుతో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలో జమ్ముకశ్మీర్ ప్రజలు తమ గొంతు వినిపించుకునే అవకాశానికి దూరమయ్యారని పిటిషనర్లు వాదిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు అనేది బీజేపీ ప్రధాన నినాదాల్లో ఒకటిగా ఉన్నది. బీజేపీ మొదటి నుంచీ తాము అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని, రామాలయాన్ని నిర్మిస్తామని, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువస్తామని చెబుతూ వచ్చింది. ఇప్పటికే రామాలయం పూర్తికావస్తుండగా, అంతకు ముందే 370 ఆర్టికల్ రద్దు చేశారు. ఇక ఉమ్మడి పౌరస్మృతిని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.