Road Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు దుర్మరణం
Road Accident | ఏపీ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. సోమవారం అర్ధరాత్రి తర్వాత దర్శి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా.. మరో 20 మంది వరకు గాయాలపాలయ్యారు. ఓ వివాహ వేడుక కోసం కాకినాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 45మంది ప్రయాణికులతో […]

Road Accident |
ఏపీ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
సోమవారం అర్ధరాత్రి తర్వాత దర్శి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా.. మరో 20 మంది వరకు గాయాలపాలయ్యారు. ఓ వివాహ వేడుక కోసం కాకినాడ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 45మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఉన్నారని జిల్లా ఎస్పీ మల్లికా తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సాగర్ కెనాల్ వంతెన సమీపంలో మరో వాహనాన్ని తప్పించే గ్రమంలో వంతెనను ఢీకొట్టి.. అందులోనే పడిపోయిందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని, ప్రమాదానికి సంబంధించి డయల్ 100 నంబర్‌కు సమాచారం వచ్చిందని ఎస్పీ వివరించారు.
పొదిలికి చెందిన ఓ వ్యక్తి వివాహం ఇటీవల జరిగింది. కాకినాడలో జరిగే రిసెప్షన్ కోసం పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. పొదిలి నుంచి కాకినాడ వెళుతుండగా ప్రమాదం జరిగింది. సాగర్ కాల్వ రిటైనింగ్ వాల్‌ను ఢీకొట్టి దాదాపు 30అడుగుల లోతులో ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
ప్రమాదం జరిగిన వెంటనే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు గాయపడ్డ వారిని రక్షించారు. కాలువలో నీరు ఎక్కువగా లేకపోవడంతో ప్రాణనష్టం భారీగా తప్పింది. బస్సు వెనుక సీట్లలో కూర్చుని వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు.
ఘటన తర్వాత హాహాకారాలు, రోధనలు సంఘటనా స్థలం మిన్నంటాయి. ఘటనలో మృతి చెందిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హాని (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65),షేక్ షబీనా(35), షేక్ హీనా(6)గా గుర్తించారు.