తొలి రోజు భయమేసింది.. చాలా మటుకు నిద్రలేని రాత్రులే..

మొదటి 24 గంటలు చాలా భయంభయంగా గడిపాం. నరకం కనిపించింది. మేం ఇక్కడ చిక్కుకుపోయిన సంగతి ఎవరికైనా తెలుసో లేదో, మాకు అప్పటికి తెలియదు

తొలి రోజు భయమేసింది.. చాలా మటుకు నిద్రలేని రాత్రులే..

ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మాట

17 రోజులు.. 422 గంటలు! సొరంగంలో బందీలు! బయటకు వస్తామో లేదోననే భయం! కానీ.. ఆ భయాన్ని వారు జయించారు. మృత్యుంజయులై తిరిగి వచ్చారు. ఇది ఉత్తరకాశీ సిల్కియారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కథ. 41 మంది కార్మికులు ఈ సొరంగంలో పనిచేస్తుండగా నవంబర్‌ 12న సొరంగంలో కొంత భాగం కూలిపోయి.. చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 17 రోజుల శ్రమ అనంతరం వారిని ఎన్డీఆరెఫ్‌, ఇతర బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

చికిత్స పొందిన అనంతరం ఆ 41 మంది తమ స్వగృహాలకు చేరుకున్నారు. వారిలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన విశాల్‌ కుమార్‌ అనే కార్మికుడు ఆ 17 రోజుల అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ‘మొదటి 24 గంటలు చాలా భయంభయంగా గడిపాం. నరకం కనిపించింది. మేం ఇక్కడ చిక్కుకుపోయిన సంగతి ఎవరికైనా తెలుసో లేదో, మాకు సహాయం చేయడానికి వస్తున్నారో లేదో మాకు అప్పటికి తెలియదు. మా మనసులలో అనేక ఆలోచనలు..’ అని ఆయన ఒక వార్త సంస్థకు వివరించారు. చాలా వరకూ నిద్రలేని రాత్రులు గడిపామని చెప్పారు. ‘పగలు చాలా సమయం మాట్లాడుకుంటూనో, నిద్రపోతూనో గడిపాం. మేం బయటకు రావడానికి ఇన్ని రోజులు పడుతుందని అనుకోలేదు. ఐదు పది రోజుల్లో బయటపడుతాం అనుకున్నాం. తమకు అధికారులు, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోదీ ఎంతగానో మద్దతు ఇచ్చారని చెప్పారు.


ఇక ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తమతో నిత్యం సంప్రదించాయని, జరుగుతున్న ప్రయత్నాలను వివరించాయని కుమార్‌ తెలిపారు. ‘మాకు అన్నిరకాల సహాయం అందించారు. శిథిలాల గుండా ఏర్పాటు చేసిన పైపు లోంచి మాకు ఆహారం, ఇతర పదార్థాలను పంపించారు. ఆ పైపు ద్వారానే మాకు ప్రాణవాయువు అందింది’ అని వివరించారు. నవంబర్‌ 12న సొరంగం కూలిపోయిన తర్వాత రెండు రోజులపాటు బయట ఉన్న సిబ్బంది దానిని తవ్వేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు.


అయితే మధ్యలో ఎదురైన సాంకేతిక సమస్యలతో వారిని బయటకు తీసుకురావడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నది. ఆగర్‌ మిషన్‌ కూడా విఫలమవడంతో ఆఖరి దశలో పదిపన్నెండు మంది సహాయ సిబ్బంది పలుగుపారలతో, చేతితో వాడే డ్రిల్లింగ్‌ మిషన్లతో శిథిలాలను తొలుచుకుంటూ పోయారు. ఎట్టకేలకు ఆ ప్రయత్నం సఫలం కావడంతో 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం వారివారి ఇండ్లకు పంపించారు.