దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలి

గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని దళిత బంధు సాధన సమితి డిమాండ్‌ చేసింది.

దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలి

పార్టీల మధ్య వైషమ్యాలను దళితులపై రుద్దొద్దు

కలెక్టరేట్ ఎదుట దళిత బంధు సాధన సమితి నిరసన

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని దళిత బంధు సాధన సమితి జిల్లా కన్వీనర్ పాలడగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు ప్రక్రియను ప్రారంభించాలనే డిమాండ్ తో శుక్రవారం శాలిగౌరారం మండలానికి సంబంధించి దళిత బంధుకు ఎంపికైన 270 మంది బాధితులతో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. భేషజాలాలకు పోకుండా, పార్టీల మధ్యన ఉన్న వైషమ్యాలను పక్కకు పెట్టి దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు గ్రౌండ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ మొత్తం జరిగిందని, విడుదల చేసే నిధులను ఫ్రీజింగ్ చేయడం సరికాదని అన్నారు. నల్లగొండ నియోజకవర్గం లోని 1050 మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలి గౌరారం మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన 270 మందిని దళిత బంధు పథకం కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసి, నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళిత బంధు నిధులను రిలీజ్ చేయలేదన్నారు.

ప్రభుత్వం మౌనం వీడాలి : పందుల సైదులు

డిసెంబర్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే కొనసాగిస్తుందో.. అదే తరహలో దళిత బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను కొనసాగిస్తూ ఒక దళిత బంధు పథకం విషయమంలో ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో స్పష్టం చేయాలన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను అగ్గిపాలు చేయకుండా ఎక్కడనైతే ప్రక్రియ ఆగిపోయిందో అక్కడనుండి పున: ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.


అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 12 లక్షల రూపాయలను దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు చేసి వారి ఆదరాభిమానాలను పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దళిత బహుజన సామాజిక ప్రజా సంఘాలను కలుపుకొని దళిత బంధు బాధితుల ఉద్యమాన్ని రాష్ట్రస్థాయి ఉద్యమంగా మలుచుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి రమేష్, ఏర్పుల నరేందర్, పోతే పాక నవీన్, బడుపుల శంకర్, మామిడి యాకూబ్, అద్దంకి రవీందర్, రాచకొండ గణేష్, మాచర్ల వెంకట్, ఈర్ల కిరణ్, డేగాల ఏలీష, మాగి రవి, పులిగిల్ల శంకర్, పనికర కమలాకర్, గుండ్లపల్లీ రవి, బందేల ఉదయ, తోటకూరి వంశీ, నక్క నరేష్, రావీ దావీదు, ఆంజనేయులు, దేవరకొండ శ్రీనివాస్, మాచర్ల అంజయ్య, సైదులు, సురేష్, యాదగిరి పాల్గొన్నారు.