వాహనాల నంబర్‌ ప్లేట్లపై టీఎస్‌ బదులు టీజీ

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఇప్పుడు ఉన్న టీఎస్‌ బదులు.. టీజీ అని మార్చనున్నారు.

వాహనాల నంబర్‌ ప్లేట్లపై టీఎస్‌ బదులు టీజీ

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

మరో రెండు గ్యారెంటీలకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో వాహనాల నంబర్‌ ప్లేట్లపై టీఎస్‌ అని ఆంగ్ల అక్షరాలు ఉంచాలని అప్పటి బీఆరెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ అనే అక్షరాలు వస్తాయని అంతా భావించినా, బీఆరెస్‌ ప్రభుత్వం భిన్నంగా తీసుకున్నది. ఉద్యమకాలంలో అనేక మంది టీజీ అనే సంక్షిప్త నామాన్ని ఉపయోగించారు. పలువురు నేతలు ఫైన్‌లను ధిక్కరించి మరీ తమ వాహనాలకు టీజీ అనే అక్షరాలు వాడారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వాహనాలకు ప్రస్తుతం ఉన్న టీఎస్‌ బదులు.. టీజీగా మార్చాలని నిర్ణయించింది. దీంతో ఇకపై అన్ని వాహనాలకు టీజీ అనే అక్షరాలు రానున్నాయి. అయితే.. ఇప్పటికే టీఎస్‌ అని ఉన్నవాటిని ఏం చేస్తారన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉన్నది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందించే హామీలకు మంత్రివర్గం తెలిపింది.