ఉత్తరకాశీ సొరంగం విషయంలో కొత్త ట్విస్ట్.. ఉండాలా? ఊరెళ్లిపోవాలా?
అసలే ప్రమాదకరంగా సొరంగం తయారైంది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు.. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు అయోమయానికి గురవుతున్నారు.

- పనుల పునఃప్రారంభంపై సందిగ్ధత
- సిల్కియార సొరంగం కార్మికుల్లో అయోమయం
- ఉండటమా?.. ఊరెళ్లపోవడమా?
41మంది కార్మికులు 17 రోజుల తరబడి చిక్కుకునిపోయిన సిల్కియార సొరంగం పనుల విషయంలో సందిగ్ధం నెలకొన్నది. పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియక.. ఉండాలా? ఊరికి వెళ్లిపోవాలా అన్న అయోమయంలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇకపై ఆ సొరంగం పనిలో ఉండొద్దంటూ కొంతమందికి ఇళ్ల నుంచి ఒత్తిడి కూడా వస్తున్నది. మరోవైపు సొరంగం విషయంలో భద్రతపై పూర్తిస్థాయిలో సమీక్షించిన తర్వాతే నిర్మాణ పనులు పునరుద్ధరిస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేకించి సొరంగంలో కొంత భాగం కూలిపోయి.. 41 మంది కార్మికులు చిక్కుబడిపోవడంతో అక్కడ పనిచేయడం ఎప్పటికైనా ప్రమాదమేనని భావిస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు.. ఇంటికి వచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారి మాట వినాలా? లేక పని చేయాలా? అనే అయోమయంలో కార్మికులు ఉన్నారు. ‘నేను సెలవుకోసం దరఖాస్తు చేశాను. ఇంటికి వెళ్లిపోతాను. ఇక్కడ పని ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియకుండా ఉన్నది’ అని బీహార్ నుంచి వచ్చిన ఒక మిషన్ ఆపరేటర్ చెప్పాడు.
ఇక్కడ ప్రమాదకరంగా పరిస్థితులు ఉన్నాయని అసలు ఈ పని వదిలేయాలని తన తల్లి ఒత్తిడి చేస్తున్నదని మరో కార్మికుడు తెలిపాడు. సొరంగంలో చిక్కకున్నవారిని రక్షించడానికి కొండ పై భాగం నుంచి దాదాపు 45 మీటర్లు తవ్వాల్సి వచ్చిందని, సొరంగం కూలిపోయిన శిథిలాలు ఇక్కడా అక్కడే ఉన్నాయని ప్రభుత్వ అధికారులు చెప్పారు.