Nagarjuna Sagar| నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత..మంత్రి కోమటిరెడ్డి డుమ్మా !

విధాత : నల్గగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar) క్రస్ట్ గేట్ల(Crest Gates)ను ఎత్తి దిగువకు నీటి విడుదల(Water Release) చేశారు. మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఆడ్లురి లక్ష్మణ్(Adluri Laxman)లు ప్రత్యేక పూజల అనంతరం 13,14క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుల చేశారు. క్రమంగా ప్రస్తుతం 26 గేట్లు (పూర్తి స్థాయి గేట్లు) ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి జూలై నెలలోనే క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడం 18 ఏళ్ల తర్వాత ఇది తొలిసారి కావడం గమనార్హం. సాగర్ ప్రాజెక్టుకు ఎగువన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండగా నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరుకుంది. దీంతో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ లు గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రక్రియను ఆరంభించారు. దాదాపు 2లక్షలకు పైగా ఇన్ ఫ్లో వస్తుండటంతో సాగర్ జలాశయ నీటి మట్టం 590అడుగులకు గాను 588అడుగులకు చేరింది. 312టీఎంసీలకు గాను 306టీఎంసీలకు చేరింది.
అలిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత కార్యక్రమానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ముగ్గురు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆడ్లూరి లక్ష్మణ్ హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం కోమటిరెడ్డి ఉదయం 9గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నప్పటికి 10గంటల వరకు కూడా ఉత్తమ్ రాలేదు. దీంతో ఉత్తమ్ రాక కోసం ఎదురుచూసి విసుగెత్తిన కోమటిరెడ్డి అలిగి ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి వెళ్లిపోయారు. సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు దూరంగా ఉన్నారు. కేవలం జిల్లా ఇంచార్జి మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ లు మాత్రమే క్రస్ట్ గేట్లను ఎత్తి నీటి విడుదల తతంగం నిర్వహించారు.