TATA Nano EV | రతన్​ టాటా కలల కారు టాటా నానో ఈవీ మళ్లీ పరుగులు పెడుతుందా..!

టాటా నానో.. లక్ష రూపాయల కారుగా దేశాన్నే కాదు, ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన కారు. రతన్​ టాటా భారత ప్రజల కోసం ఎంతగానో తపించి తీసుకొచ్చిన కారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు కూడా కార్లో తిరగాలనే ఆయన ఆశయానికి ప్రతిరూపం టాటా నానో. ఇప్పుడు సరికొత్త అవతారంలో ముందుకొస్తోందని తెలుస్తోంది. దాని పేరే నానో నియో.

TATA Nano EV |  రతన్​ టాటా కలల కారు టాటా నానో ఈవీ మళ్లీ పరుగులు పెడుతుందా..!

రతన్​ టాటా(Ratan Tata), టాటా మోటార్స్​ అధినేత. టాటా మోటార్స్​(Tata Motors)  నుండీ ఎన్నో విజయవంతమైన వాహనాలను ప్రవేశపెట్టిన ఆయనకు మధ్యతరగతి ప్రజలు కూడా కార్లో తిరగాలనే ఆశ గట్టిగా ఉండేది. తన ఆశలకు అనుగుణంగా లక్ష రూపాయలకే కారు తయారుచేసి అమ్మాలని సంకల్పించుకున్న రతన్​ మేధోపుత్రిక టాటా నానో(Tata Nano). ఈ బుల్లి కారు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. 2008 జనవరి 10న మార్కెట్లోకి ప్రవేశించిన నానో ప్రారంభంలో పెను సంచలనం సృష్టించింది. కేవలం లక్ష రూపాయలకే(Car for 1 Lakh rupees) కారు అంటే ఎవరూ నమ్మలేదు. కానీ, కారు బయటకొచ్చాక, జనాలు బారులు తీరారు. సంవత్సరానికి 2,50,000 కార్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టకున్నా, ఆచరణలో అది సాధ్యం కాలేదు. ఫ్యాక్టరీలో రకరకాల సమస్యలతో సకాలంలో కార్లను అందించడం కష్టమైంది. దానికి తోడు కొన్ని నానో కార్లు మంటలు అంటుకోవడంతో, ప్రజల్లో ఇది సురక్షితం కాదనే అభిప్రాయం బలంగా ఏర్పడటంతో ఒక్కసారిగా డిమాండ్​ కుప్పకూలింది. నానో వల్ల టాటా మోటార్స్​ విపరీతంగా నష్టపోయింది. 2018లో ఈ కారు ఉత్పత్తిని పూర్తిగా ఆపేసినట్లు(Production Halted) కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కానీ రతన్​ టాటాకు దానితో ఉన్న అనుబంధం, ఆపేక్షా ఇంకా బతికేఉన్నాయి. ఫలితం, టాటా నానో ఈవీ(Nano.ev). టాటా నానో ఎలక్ట్రిక్​ కారు(Electric Nano). ప్రస్తుతం అత్యంత గోప్యంగా ఈ కారును తయారుచేసి మార్కెట్లోకి తీసుకురావాలని టాటా మోటార్స్​ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యుత్​ కార్ల రంగంలో టాటాకు చెప్పుకోదగ్గ పేరుంది. తన పేరు పొందిన మాడళ్లయిన నెక్సన్​, పంచ్​, టియాగో, టైగోర్​లను విద్యుత్​ కార్లుగా కూడా ప్రవేశపెట్టి ఘనవిజయం సాధించింది. కాబట్టి, నానో కారును విద్యుత్​ కారుగా మలిచి మళ్లీ ప్రవేశపెట్టడం వారికి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ధర ఎలా ఉంటుంది? అనేదే ప్రశ్న. ఇప్పటికే ఎంజీ మోటార్స్(MG Motors)​, కామెట్(Comet EV)​ పేరుతో బుల్లి ఈవీ కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఇదే చిన్న, చవకైన విద్యుత్​ కారు. రెండు డోర్లతో, నాలుగు సీట్లతో చాలా చిన్నగా ఉండే ఈ కారు చూడటానికి గమ్మత్తుగా ఉంటుంది. కామెట్​ ధర 7 లక్షల నుండి 10 లక్షల దాకా ఉంది. అయితే టాటా టియాగో ఈవీ (Tata Tiago.ev)చాలా విజయవంతమైన మినీ కారు. 8 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతోంది. ఇంత కంటే తక్కువ ధరలో నానోను తీసుకురాగలదా అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్న.

కానీ, ఇంటర్​నెట్​ వేరుగా స్పందిస్తోంది. టాటా నానో ఈవీ వస్తోందని రకరకాల ఫోటోలు, డిజైన్లతో నెట్​ అంతా హోరెత్తిపోతోంది. కంపెనీ మాత్రం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అలాగని ఖండించనూ లేదు. కానీ, టాటా మోటార్స్​ అనుబంధ సంస్థ అయిన జయం మోటార్స్​, జయం నియో(Jayem Neo) పేరుతో ఒక ఎలక్ట్రిక్​ మినీ కారును 2015లోనే తయారుచేసింది. ఓలా క్యాబ్స్​(Ola Cabs) కోసం ఒక 500 కార్లను నానో ప్లాట్​ఫాం X3 పై పూర్తిగా రతన్​ టాటా పర్యవేక్షణలో  నిర్మించి ఇచ్చింది. చూడటానికి అచ్చుగుద్డినట్లు నానో లానే ఉన్న ఈ కారే సరికొత్త నానో ఈవీగా చెబుతున్నారు.

ఈ జయం నియో 48వోల్టుల బ్యాటరీతో తయారుచేసారు. 130 కిమీ సింగిల్​ చార్జింగ్​ మైలేజి ఇచ్చేది. దీన్నే ఇంకా మెరుగుపరిచి నానో నియోగా ప్రవేశపెట్టే అలోచనలో టాటా మోటార్స్​ ఉన్నట్లుగా తెలుస్తోంది.

జనరల్​ మోటార్స్​కు చెందిన ప్లాంటు తమిళనాడులోని మలైమలార్​ ఉంది. ఫోర్డ్​ ఎలాగూ దేశంనుండి వెళ్లిపోయింది కాబట్టి, ఈ ప్లాంటును హస్తగతం చేసుకోవాలని టాటా మోటార్స్​ ప్రయత్నిస్తోంది. ఒకవేళ తీసేసుకుంటే దాన్ని నానో ఈవీ(జయం నియో)కి ఉపయోగిస్తారని టాక్​. అయితే నానో ఈవీ నగర పౌరులకు మాత్రమే పనికొస్తుంది. అంటే, ఇంటి నుండి ఆఫీసుకు మాత్రమే వెళ్లే వినియోగదారులన్నమాట. దాని సింగిల్​ చార్జింగ్ మైలేజి దాదాపు 200 నుండి 225 కిమీ ల దాపులో ఉండచ్చని వినికిడి. ఇది 72 ఓల్టుల బ్యాటరీతో తయారవుతున్నట్లు తెలిసింది.

ధర సుమారు 5 లక్షల లోపే ఉండేట్లుగా రతన్​ టాటా ప్రయత్నిస్తున్నాడట. లేకపోతే కొంచెం ఎక్కువ ధరలో టియాగో ఎలగూ ఉండనే ఉంది కదా. కాబట్టి నానో నియో ధర ఖచ్చితంగా 5 లక్షలలోపే ఉండాలి. చూద్దాం. నానో నియో కొత్త అవతారం ఎలా ఉండబోతోందో..