Mahanati Savitri : వెండితెర జాబిలి సావిత్రి..వైరల్ గా 4కే చిత్రం

తెలుగు వెండితెర జాబిలి మహానటి సావిత్రి 4K చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్. సహజ సౌందర్యానికి నెటిజన్లు ఫిదా!

Mahanati Savitri : వెండితెర జాబిలి సావిత్రి..వైరల్ గా 4కే చిత్రం

Mahanati Savitri | విధాత : తెలుగు సినీ పరిశ్రమ ధృవతార మహానటి దివంగత సావిత్రి సినీ ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయురాలు. తన అందం..అభినయంతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా ఎదిగి నటనకు బెంచ్ మార్క్ గా నిలిచిన మహానటి. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా సరే సావిత్రి మాత్రం.. తెలుగు తెరపై చెరిగిపోని మధుర జ్ఞాపకం. అయితే నేటి తరం వారికి సావిత్రి ముగ్ధమనోహర రూపం బ్లాక్ ఆండ్ వైట్ లో కాకుండా రంగుల్లోనూ చూపించే ప్రయత్నం తరచు చేస్తున్నారు. సావిత్రి నటనా కౌశలానికి మాయాబజార్ శశిరేఖ పాత్ర నిలువెత్తు నిదర్శనం. కొన్నాళ్ల క్రితం ఆ సినిమాను రంగుల్లో తీసుకొచ్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించారు. ఇప్పుడు సావిత్రి చిత్రాలను 4కే టెక్నాలాజీతో రంగులద్ధి కొంత మంది సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ ఆండ్ వైట్ సినిమాల్లోని అభినేత్రి సావిత్రి ఫోటోలను 4కే విజువల్ లో చూసిన నెటిజన్లు సహజమైన అందంతో ఉన్న ఆమె ముఖ సౌందర్యానికి..ముగ్ద మనోహర రూపానికి ఫిదా అయిపోతున్నారు. నటన కంటే కృత్రిమ అందాల ప్రదర్శనతో కొన్ని సినిమాలకే తెరమరుగైపోతున్న నేటి తరం హీరోయిన్లతో పోలిస్తే సహజమైన అందం..అభినయంతో సినీప్రియులను రంజింపచేసిన సావిత్రి గూర్చి ఎంత పొగిడిన తక్కువేనంటున్నారు. సావిత్రి నిజంగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఇప్పటికీ ఎప్పటికీ ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అంటూ కితాబునిస్తున్నారు.

సావిత్రి నేపథ్యం…

1936 డిసెంబర్ 6న గుంటూరులోని చిర్రాపూర్ గ్రామంలో జన్మించిన సావిత్రి 47 ఏళ్ళ వయసులో 19 నెలలు కోమాలో ఉండి 1981డిసెంబర్ 26న మరణించారు. ఆమెకు ఆరు నెలల వయసున్నప్పుడు తండ్రి చనిపోవడంతో.. తల్లితో కలిసి పెద్దమ్మ అన్నపూర్ణమ్మ వద్ద పెరిగింది. సావిత్రిలోని డాన్సులు, నటన ప్రతిభని గమనించిన పెదనాన్న వెంకట్రామయ్య ఆ దిశగా ప్రోత్సహించి డ్యాన్సులు నేర్పించి నాటకాలు ప్రదర్శింప చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకొచ్చారు. 13 ఏళ్ల వయసులో కాకినాడలోని ఆంథ్రనాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఈమె జీవితాన్ని మలుపుతిప్పింది. నర్తకిగా కెరీర్‌ స్టార్ట్ చేసిన సావిత్రికి ‘సంసారం’ అనే సినిమాలో తొలి ఛాన్స్ రాగా.. తక్కువ వయసుందనే కారణంతో ఆమెని తీసేశారు. తర్వాత ‘పాతాళభైరవి’ సినిమాలో ఓ పాటలో నటించింది. ఆ తర్వాత రూపవతి, ఆదర్శం చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది. ‘పెళ్ళిచేసి చూడు’ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది. 1953లో ‘దేవదాసు’లో పార్వతి పాత్రతో ఆమె తెలుగు సినిమాలలో అగ్ర హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని మెుదలుపెట్టింది. `మిస్సమ్మ`తో స్టార్ హీరోయిన్ గా మారి తెలుగు, తమిళంలో ప్రముఖ హీరోయిన్ గా ఎదిగి తన నటనతో ఎన్నో అవార్డులు అందుకుంది.

స్టార్‌ హీరోయిన్ గా ఉండగానే నటుడు జెమినీ గణేషన్ తో చేసుకున్న ప్రేమ, పెళ్ళి జీవితం సావిత్రి లైఫ్‌ని తలక్రిందులు చేసింది. దర్శకత్వం, నిర్మాణం సైతం ఆర్థికంగా దెబ్బకొట్టాయి. సావిత్రి, గణేశన్ లకు కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకుసతీష్ కుమార్ లు సంతానం. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో సావిత్రి ఎంత గొప్పగా ఎదిగిందో, అంతే దీన స్థితిలో కోమాలోకి వెళ్లి చనిపోయింది. సావిత్రి బయోపిక్ మహానటి సినిమాగా విశేష ప్రేక్షకాదరణ, ప్రశంసలు అందుకుంది.