Kalaimamani Award Winner Sai Pallavi | సాయి పల్లవికి కలైమామణి పురస్కారం

సాయి పల్లవి 2021 కోసం తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డు ప్రకటించింది. రామాయణ్‌లో సీతగా నటిస్తోంది.

‘Kalaimamani’ Awards-Sai Pallavi

విధాత : సహజ నటన..అందంతో సినీ ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ సాయిపల్లవి మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను అందుకుంది. కళారంగంలో ప్రతిభ కనబరుస్తోన్న వారికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అందించే ‘కలైమామణి’ అవార్డు సాయి పల్లవిని వరించింది. తమిళనాడులోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డును 2021 సంవత్సరానికి గానూ సాయి పల్లవి అందుకోబోతున్నారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను ఏడాదికి 30 మందికి చొప్పున బుధవారం 90 మంది కళాకారులకు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సాయి పల్లవికి, దర్శకుడు-నటుడు ఎస్. జె. సూర్య, దర్శకుడు లింగుసామి, నటుడు విక్రమ్ ప్రభు, మణికందన్ లు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సహా ఆరుగురికి ఈ పురస్కారం లభించింది. వీరే కాకుండా జాతీయ పురస్కారాల విభాగంలో ప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు., ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పురస్కారాన్ని ప్రకటించారు.

సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళా రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళైమామణి అవార్డు గ్రహీతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఆక్టోబర్ లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

రామాయణ్ లో సీతగా..
2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో తెలంగాణకు చెందిన భానుమతి అనే పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి తెలుగు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. తెలుగులో మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, గార్గి, విరాట పర్వం, అమరన్, తండెల్ చిత్రాలలో నటించి మెప్పించింది. తమిళ, మలయాళ సినిమాలలో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ్ లో సీతగా నటిస్తుంది.