విధాత : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను కృష్ణ జింకల వేట కేసు వదలడం లేదు. తాజాగా ఈ కేసులో తనను దోషిగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉండగానే..ఈ కేసులో నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం, దుష్యంత్ సింగ్ లను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రాజస్థాన్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో ఈ రెండు పిటిషన్ల విచారించిన రాజస్థాన్ హైకోర్టు తదుపరి తేదీని ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ఇప్పటికే కోర్టు కేసులతో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ కు ఇదే విషయంలో గ్యాంగ్ స్టర్ రవి బిష్ణోయ్ నుంచి ముప్పు కొనసాగుతునే ఉంది.
1998లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ జోధ్ పూర్‌లోని కంకణి గ్రామం సమీపంలో జరుగుతుండగా, సల్మాన్ అతడి సహచర బృందం అడవిలో వేటకు వెళ్లారు. అక్కడ బిష్ణోయ్ తెగ ప్రజలు పవిత్రంగా భావించే కృష్ణజింకను వేటాడారు. వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నమోదైన కేసు దశాబ్ధాల పాటు విచారణ సాగింది. ఏప్రిల్ 5, 2018న, జోధ్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు వన్యప్రాణుల రక్షణ చట్టం కింద సల్మాన్‌ను దోషిగా నిర్ధారించింది. అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా విధించింది. సహ నిందితులలో ఐదుగురు, అంటే సైఫ్ అలీ ఖాన్, టబు, ‘సాక్ష్యాలు లేకపోవడం’ కారణంగా ఈ కేసులో నిర్దోషులుగా విడుదలయ్యారు. తనను దోషిగా తేల్చడాన్ని సల్మాన్ ఖాన్ హైకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు సహా నిందితుల విడుదలను సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లు తాజాగా విచారణ సాగుతున్నాయి.