Ram Charan | రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ ఆగ్రహం – శిరీష్ క్షమాపణ

Ram Charan | గేమ్‌చేంజర్( Game Changer ) సినిమా ఫెయిల్యూర్ తర్వాత నిర్మాత శిరీష్( Producer Shirish ) ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడో పెద్ద దుమారానికి కారణమయ్యాయి. దర్శకుడు శంకర్ గానీ, హీరో రామ్ చరణ్( Ram Charan ) గానీ సినిమా నష్టాలపై తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదనిచేసిన అతడి వ్యాఖ్యలు మెగా అభిమానుల మనసును కలిచివేశాయి. గత కొన్నేళ్లుగా గేమ్‌చేంజర్ కోసం ఆశగా ఎదురుచూసిన రామ్ చరణ్ అభిమానులు, సినిమా ఫలితంతో ఇప్పటికే మానసికంగా క్షోభపడుతున్నారు. ఈ స్థితిలో శిరీష్ వ్యాఖ్యలువారి ఆవేశానికి, ఆగ్రహానికి కారణమయ్యాయి.

  • By: raj    cinema    Jul 03, 2025 8:00 AM IST
Ram Charan | రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ ఆగ్రహం – శిరీష్ క్షమాపణ
  • గేమ్​చేంజర్​పై రామ్​చరణ్​ గురించి తీవ్రవ్యాఖ్యలు చేసిన శిరీష్​
  • మెగాఫ్యాన్స్​ ఆగ్రహావేశాలతో బహిరంగ లేఖ
  • నష్టనివారణ చర్యలకు దిగిన దిల్​ రాజు – తమ్ముడితో క్షమాపణ
  • ‘తమ్ముడు’ సినిమాకు ముందు ఈ రచ్చ సినిమాకు మచ్చ?

తీవ్రంగా స్పందించిన అభిమానులు “ఇది గమనిక కాదు, చివరి హెచ్చరిక” అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో వారు ఒకేఒక్క సినిమాతో హీరోను నిలదీయడాన్ని ఖండిస్తూ, పరిశ్రమలో వచ్చిన పలు ఇతర సినిమాల నష్టాల నేపథ్యంలో ఎవరేమన్నారో గుర్తు చేశారు. మైత్రీ మూవీస్ నుంచి వచ్చినఫ్లాప్​ చిత్రాలపై ఎవరూ హీరోల పేర్లు తెచ్చి మాట్లాడలేదని, అదే శిరీష్ మాత్రం రామ్ చరణ్‌ను లక్ష్యంగా తీసుకుని తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు.

లేఖలో ప్రస్తావించిన ఆరు ప్రశ్నలు స్పష్టంగా,సూటిగా ఉండడం గమనార్హం.

  1. “నేనొక్కడినే టైంలో మీరు హీరోపై ఒక్కమాట అన్నారా?”
  2. “మైత్రీ బ్యానర్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు హీరోల్ని విమర్శించారా?”
  3. “సైంధవ్ ఫెయిలయినప్పుడు వెంకటేష్ గారి గురించి మాట్లాడారా?”
  4. “వెంకటేష్ సినిమాతో లాభాలొస్తే ఎంత ఇవ్వడం జరిగింది?”
  5. “ఒక సంవత్సరం చెప్పి మూడు సంవత్సరాలు వృథా చేసిన బాధ్యత ఎవరికి?”
  6. “RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీదనే విమర్శలు చేయడం సమంజసమా?”

ఈ లేఖలో ఉన్న పదాలు కేవలం ప్రశ్నలుగా మాత్రమే కాకుండా — ఆవేదన, కోపం, నిరాశ,వారి అభిమాన నటుడిపై గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. “మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడడం మమ్మల్ని బాధకు గురి చేస్తోంది. ఇకపై గేమ్ చేంజర్ సినిమా గానీ, రామ్ చరణ్ గారి గురించి గానీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి” అని స్పష్టంగా హెచ్చరించారు.

ఈ ఉదంతం రామ్ చరణ్ అభిమానులు వర్సెస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే తరహాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.నితిన్​ ‘తమ్ముడు’ సినిమా విడుదలకు ముందు ఈ వివాదం ప్రొడక్షన్ హౌస్‌కు, చిత్రానికి కూడా డ్యామేజ్​గా మారుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్న తరుణంలో నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్​ రాజు వివరణ ఇచ్చారు. శిరీష్​ వ్యాఖ్యల విషయం తీయకుండా చిరంజీవి, రామ్​చరణ్​ పట్ల తనకెంత అభిమానముందో తెలిపారు. గేమ్​చేంజర్​ ఫలితం వల్ల చరణ్​ బాధపడ్డారని, ఆయనకు ఓ గొప్ప హిట్​ ఇవ్వాల్సిన బాధ్యత తనమీదుందని పరోక్షంగా శిరీష్​ను కాపాడే ప్రయత్నం చేసారు.

ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించిన దిల్ రాజు, అనంతరం శిరీష్​తోకూడా ఓ బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇప్పించారు. ఆయన తన లేఖలో “నాపై వచ్చే విమర్శలు నాకు తెలుసు. నేను ఎవరినీ ఇబ్బందిపెట్టాలని అనలేదు. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ కోసం చాలా సమయాన్ని ఇచ్చారు. సినిమాకు సహకరించారు. ఆయనను గానీ, చిరంజీవి గారిని గానీ, వారి అభిమానులను గానీ  బాధించాలన్న ఉద్దేశంతోనేను మాట్లాడలేదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే క్షమించండి” అని పేర్కొన్నారు.

ఈ లేఖతో ఈ వివాదానికి ఓ ముగింపు కనిపిస్తోందా? అనే ప్రశ్న అభిమానులతోనే తేలబోతోంది. అయితే అభిమానులు ఇప్పటికీ శాంతించినట్టు కనిపించడం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యల తీవ్రతకు, ఈ లేఖలో ప్రస్తావించిన పశ్చాత్తాపం సరిపోదన్నట్లుగా  కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. క్షమాపణ లేఖ శిరీష్​ మనస్ఫూర్తిగా రాసినట్లు కనిపించడంలేదని, మనసులో ఇంకా ఆయన అదే భావంతో ఉన్నట్లు ఈ లేఖలో ప్రస్ఫుటమౌతోందని మెగా అభిమానుల చర్చల్లో కనిపిస్తోంది.

ఇదే సమయంలో మరో వర్గం ఫ్యాన్స్ మాత్రం “మనం సంయమనం పాటించాలి, శిరీష్ లేఖలో క్షమాపణ స్పష్టంగా ఉంది. ఒకసారి అవకాశం ఇవ్వాలి” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం మెగా అభిమానులకు గల శక్తిని, వారి ఆవేదనను, హీరో పట్ల వారి నిబద్ధతను మరోసారి బలంగా చూపించిందన్నదిమాత్రం నిస్సందేహం.