Sobhita Dulipala OTT Film : ఓటీటీ డబ్బింగ్ లో శోభిత ధూళిపాళ్ల ‘చీకట్లో’ కొత్త రికార్డు
శోభిత దూళిపాల నటించిన వెబ్ మూవీ 'చీకట్లో' ఓటీటీలో అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో దాదాపు 18 భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.

విధాత : అక్కినేని ఇంటి కోడలు.. నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ఓటీటీలో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శోభిత ధూళిపాళ్లతో సురేష్ ప్రొడక్షన్స్ ఓ వెబ్ మూవీ నిర్మించింది. ఈ చిత్రానికి ‘చీకట్లో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ లో దాదాపు 18 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఓటీటీలో ఇన్ని భాషల్లో ఓ సినిమాని డబ్ చేయడం ఇదే తొలిసారి కావడంతో శోభిత ఖాతాలో అరుదైన రికార్డు నమోదుకానుంది. ‘చీకట్లో’ వెబ్ మూవీ నవంబరులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
శోభిత ధూళిపాళ్ల తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలలో నటించింది. హిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్‌లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. శోభిత ధూళిపాళ్ల ప్రస్తుతం తమిళంలో పా రంజిత్ డైరెక్షన్‌లో ‘వెట్టువం’ మూవీలో నటిస్తున్నది.